Telugu Global
Andhra Pradesh

చంద్రబాబునే మోసం చేస్తున్నారా?

పార్టీకి విరాళాలు ఇవ్వదలచుకున్న వారంతా నిజాయితీగా ఆన్‌లైన్లో పేమెంట్ చేయాలని చంద్ర‌బాబు సూచించారు. పేరు, ప్రచారం కోసమే విరాళాలు ప్రకటించేవారు పార్టీకి అవసరంలేదన్నారు.

చంద్రబాబునే మోసం చేస్తున్నారా?
X

ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడును నమ్మకూడదని చాలామంది చెబుతుంటారు. తమ అనుభవాలను కూడా బహిరంగంగానే చాలా మంది గుర్తు చేసుకుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును నమ్మకూడదని, నమ్మితే మోసపోవటమే అని పదేపదే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది చంద్రబాబు కూడా మోసపోయారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మాల్సిందే ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు కాబట్టి. మహానాడు సందర్భంగా పార్టీకి విరాళాల ప్రస్తావన వచ్చింది.

ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీకి విరాళాలు ఇస్తున్నట్లు మహానాడు వేదిక మీద చాలా మంది ప్రకటిస్తుంటారని అయితే తర్వాత మాయమైపోతారని చెప్పారు. వేదిక మీద నుండి లక్షల రూపాయలు విరాళాలు ప్రకటించినవాళ్ళు మళ్ళీ అడ్రస్ కనబడకుండా వెళిపోతారని మండిపడ్డారు. కేవలం పేరు, ప్రచారం కోసమే విరాళాలు ప్రకటించేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. అందుకనే తాను విరాళాల కోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చానని చెప్పారు.

పార్టీకి విరాళాలు ఇవ్వదలచుకున్న వారంతా నిజాయితీగా ఆన్‌లైన్లో పేమెంట్ చేయాలని సూచించారు. పేరు, ప్రచారం కోసమే విరాళాలు ప్రకటించేవారు పార్టీకి అవసరంలేదన్నారు. ఎందుకంటే గత మహానాడులో కొంతమంది పాతిక లక్షలు, యాబై లక్షల విరాళం ప్రకటించారట. అయితే మహానాడు అయిపోయిన తర్వాత ఎవరు కనబడలేదట. అలాగే గుంటూరులో ఒక సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.

అప్పటికప్పుడు పార్టీ తరపున మరణించిన వారి కుటుంబాలకు చంద్రబాబు కొంత మొత్తాన్ని పరిహారంగా ప్రకటించారు. వెంటనే నిర్వాహకులు కూడా లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అయితే ఎంతకాలమైనా నిర్వాహకుల నుండి చనిపోయినవారి కుటుంబాలకు ఎలాంటి డబ్బులు అందలేదట. ఇలాంటి ఘటనలను, ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకునే మహానాడు సందర్భంగా విరాళాలను ఆన్‌లైన్లోనే పంపమని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. మహానాడు చివరలో ఎంత మొత్తం విరాళాలు వచ్చాయనే విషయాన్ని పార్టీ కోశాధికారి ప్రకటించటం మామూలే. ఎన్నికల సంవత్సరం కదా భారీగానే విరాళాలు అందుతాయని అనుకుంటున్నారు. మరి రాజమండ్రి మహానాడు సందర్భంగా పార్టీకి ఎంత విరాళమొచ్చిందో చూడాలి.

First Published:  29 May 2023 6:04 AM GMT
Next Story