Telugu Global
Andhra Pradesh

పవన్ దగ్గరకు తమ్ముళ్ళ క్యూ

జనసేనలో గట్టి అభ్యర్థులు తక్కువమందున్నారు. అచ్చంగా జనసేన నేతలకు మాత్రమే పవన్ టికెట్లివ్వాలని అనుకుంటే గట్టి అభ్యర్థులు అన్నీచోట్లా దొరకరన్నది వాస్తవం.

పవన్ దగ్గరకు తమ్ముళ్ళ క్యూ
X

తెలుగుదేశం పార్టీలో ఊహించిందే జరుగుతోంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది తమ్ముళ్ళు పార్టీని వదిలేసి జనసేనలో చేరుతారని అనుకుంటున్నదే. అనుమానించిందే, అనుకుంటున్నదే ఇప్పుడు జరుగుతోంది. విషయం ఏమిటంటే.. టికెట్ల కోసం కొందరు తమ్ముళ్ళు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలుస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు కారణంగా తమకు పోటీచేసే అవకాశాలు రావని చాలామంది తమ్ముళ్ళు అనుమానించారు. తాము బలంగా ఉన్న సీట్లను పవన్ ఏరికోరి తీసుకోవటం ఖాయమని అర్థ‌మైపోయింది.

తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, బద్వేలు, రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, ఆళ్ళగడ్డ, నంద్యాల, కైకలూరు, విజయవాడ సెంట్రల్, పిఠాపురం, పెడన, ఏలూరు, భీమవరం, రాజమండ్రి రూరల్, భీమిలి, తెనాలి, పాయకరావుపేట లాంటి చాలా నియోజకవర్గాల్లో పోటీచేయాలని జనసేన నేతలు రెడీ అవుతున్నారు.

అందుకనే వ్యూహాత్మకంగా కొందరు తమ్ముళ్ళు రెండు పాయింట్లతో పవన్ తో భేటీ అవుతున్నారు. తమ సీట్లను అడగవద్దని చెప్ప‌డం మొదటి పాయింట్. ఇక తప్పదని అనుకుంటే.. తాము టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి పోటీచేయటం రెండో పాయింట్. మొదటి పాయింట్ కు దాదాపు అవకాశంలేదు. ఎందుకంటే.. జనసేన ఏ నియోజకవర్గాన్ని కోరుకున్నా అక్కడ కచ్చితంగా టీడీపీ బలంగా ఉంటుందనటంలో సందేహంలేదు. కాబట్టి మొదటి పాయింట్ వర్కవుటవ్వటానికి అవకాశాలు తక్కువ.

అందుకనే రెండో పాయింట్ మీదే తమ్ముళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారట. మాగంటి బాబు, జలీల్ ఖాన్, బూరగడ్డ వేదవ్యాస్ ఇప్పటికే పవన్తో భేటీ అయ్యారు. మరికొందరు తమ్ముళ్ళు భేటీకి రెడీ అవుతున్నట్లు సమాచారం. కలిసిన వాళ్ళు కానీ, కలవబోతున్న తమ్ముళ్ళందరూ టికెట్ల విషయం మాట్లాడటానికే కలుస్తారన్న విషయంలో సందేహంలేదు. ఈ విషయాన్ని చాలామంది మొదట్లోనే ఊహించారు. కొందరు తమ్ముళ్ళని చంద్రబాబునాయుడే జనసేనలోకి పంపించి అక్కడి నుండి పోటీచేయిస్తారని అనుకున్నదే. అంటే టీడీపీ నేతలే జనసేన టికెట్ పైన పోటీచేస్తారన్నమాట.

దీనికి కారణం ఏమిటంటే.. జనసేనలో గట్టి అభ్యర్థులు తక్కువమందున్నారు. అచ్చంగా జనసేన నేతలకు మాత్రమే పవన్ టికెట్లివ్వాలని అనుకుంటే గట్టి అభ్యర్థులు అన్నీచోట్లా దొరకరన్నది వాస్తవం. తీసుకున్న నియోజకవర్గాల్లో అన్నీచోట్లా గట్టి అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని అనిపించుకుంటే పోయేది పవన్ పరువే. ఎప్పుడైతే తమ్ముళ్ళు పవన్ను కలుస్తున్నారో టీడీపీ నేతలే జనసేనలో చేరి పోటీచేయాలని అనుకుంటున్నారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. మరి ఇంకా ఎంతమంది తమ్ముళ్ళు క్యూ కడతారో చూడాలి. పవన్ టికెట్లు ఎవరికిస్తారో చూడాలి.

First Published:  13 Jan 2024 5:20 AM GMT
Next Story