Telugu Global
Andhra Pradesh

పుట్టిన రోజు చేసుకున్నా ఏడుపేనా..?

మరో సీనియర్ తమ్ముడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్ కు ముఖ్యమంత్రిగా ఇవే చివరి ఎన్నికలని శాపనార్థాలు పెట్టారు.

పుట్టిన రోజు చేసుకున్నా ఏడుపేనా..?
X

జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఏమి జరిగినా, ఏమీ జరగకపోయినా తప్పుపట్టడమే టీడీపీ టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. జగన్ పుట్టిన రోజును వేడుకగా జరుపుకోవటంపైన కూడా టీడీపీ ఏడుస్తోంది. తమ్ముళ్ళు జగన్ను శాపనార్థాలు పెట్టేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పుట్టినరోజు వేడుకులకు రూ. 100 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని ఆరోపించారు. రూ. 100 కోట్ల ప్రజాధనం ఎలాగ వృథా అయ్యిందో మాత్రం అచ్చెన్న చెప్పలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే.. జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఎవరిష్టంవచ్చినట్లుగా వాళ్ళు జరుపుకున్నారు. అందుకు అయిన ఖర్చులన్నీ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. జగన్ పుట్టినరోజును ప్రభుత్వం అధికారికంగా ఏమీ జరపలేదు. ఎవరిష్టప్రకారం వాళ్ళు చేసుకున్న దానికి కూడా రూ. 100 కోట్లు ఖర్చయ్యిందని అచ్చెన్న ఏడవటమే ఆశ్చర్యంగా ఉంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం జగన్ రాజరికపు లక్షణానికి నిదర్శనమట. జగన్ పుట్టినరోజును వైసీపీ శ్రేణులు వేడుకగా జరుపుకోవటాన్ని కూడా అచ్చెన్న తట్టుకోలేకపోతున్నారని అర్థ‌మైంది.

ఇక మరో సీనియర్ తమ్ముడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్ కు ముఖ్యమంత్రిగా ఇవే చివరి ఎన్నికలని శాపనార్థాలు పెట్టారు. జగన్ పుట్టినరోజును వేడుకగా వైసీపీ నేతలు జరుపుకోవటాన్ని వీళ్ళు ఆక్షేపిస్తుండటమే విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబునాయుడు పుట్టినరోజును తమ్ముళ్ళు వేడుకగా జరుపుకుంటున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజును తమ్ముళ్ళు ఘనంగా జరుపుకోవచ్చు కానీ, జగన్ పుట్టినరోజును వైసీపీ నేతలు వేడుకగా జరుపుకోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు.

పైగా టీడీపీ ట్విట్ట‌ర్ అధికారిక ఖాతాలో ఒక కేక్ ను పెట్టి దాన్నిగొడ్డలితో ఛిద్రం చేస్తున్నట్లుగా ఒక పోస్టు పెట్టారు. దాని అర్థ‌మేంటో రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలరు. జగన్ పుట్టినరోజు జరుపుకోవటాన్ని తమ్ముళ్ళు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారని అర్థ‌మైంది. అసలు జగన్ పుట్టినరోజు అన్న విషయాన్ని తమ్ముళ్ళు పట్టించుకోకపోయినా ఎవరికీ నష్టంలేదు. కానీ, ఇలా శాపనార్థాలు పెట్టడం, ప్రజాధనం వృథా అయిపోతోందని గగ్గోలు పెట్టడం, కేకును గొడ్డలితో చిధ్రం చేస్తు పోస్టు పెట్టడం చూసిన వాళ్ళకు చాలా చీపుగా అనిపిస్తోంది.

First Published:  22 Dec 2023 5:20 AM GMT
Next Story