జగన్.. 10 లక్షలు ప్రకటించు- సోమిరెడ్డి డిమాండ్
చంద్రబాబు కందుకూరు రోడ్ షోలో జరిగిన ఘటనపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ ఘటనకు పోలీసులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జరిగిన ఘటన దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంపై సోమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్రం రెండు లక్షలు ప్రకటించడాన్ని మాత్రం తప్పుపట్టలేదు. దేశంలో అనేక ఘటనలు జరుగుతుంటాయి కాబట్టి కేంద్రం రెండు లక్షలు ప్రకటిందని.. ఏపీ ప్రభుత్వం కూడా రెండు లక్షలే ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ఇందులో ఎవరి తప్పిదం లేదని.. జరిగింది దురదృష్టకర ఘటన కాబట్టి తక్షణం పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఇకపై చంద్రబాబు పర్యటనల సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సోమిరెడ్డి చెప్పారు.
టీడీపీ, ఆ పార్టీ నేతలు కలిసి మృతుల కుటుంబాలకు 23 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కేంద్రం రెండు లక్షలు, ఏపీ ప్రభుత్వం రెండులక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.