Telugu Global
Andhra Pradesh

నాలుగు రోజుల్లోనే నాలుక మ‌డ‌తేసిన ప్ర‌త్తిపాటి పుల్లారావు

వైసీపీ ప్ర‌భుత్వంలో వైద్యారోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ఓ ఎన్ఆర్ఐ. 2014 ఎన్నిక‌ల‌కి ముందు ఆమెని టీడీపీలో చేర్చింది ప్ర‌త్తిపాటి పుల్లారావే. తాను తీసుకొచ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీ చేతిలో దారుణ పరాజ‌యం పాలైన పుల్లారావు

నాలుగు రోజుల్లోనే నాలుక మ‌డ‌తేసిన ప్ర‌త్తిపాటి పుల్లారావు
X

`ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` పాట విన్నాం. రాజ‌కీయ నేత‌ల మాట‌ల‌కి అర్థాలే వేరులే అని రోజూ తెలుసుకుంటున్నాం. టీడీపీ సీనియ‌ర్ నేత ప్ర‌త్తిపాటి పుల్లారావు యాంగ్రీ మెన్ సాయికుమార్‌లా మీడియా ముందుకు వ‌చ్చి డైలాగులు కొట్టి నాలుగురోజులు కాలేదు. అప్పుడే నాలుక మ‌డ‌త వేసేశారు. అంద‌రు రాజ‌కీయ నేత‌ల్లాగే త‌న వ్యాఖ్య‌లను వ‌క్రీక‌రించారంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.

నాలుగు రోజుల క్రితం ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలపై ఒక రేంజ్‌లో చెల‌రేగిపోయారు. ఈ ఎన్ఆర్ఐల‌ది ఎన్నిక‌ల హడావుడి అని, ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోకి దిగ‌బ‌డ‌తారంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఐల‌ని టీడీపీ అధిష్టానం ప్రోత్స‌హించొద్ద‌ని అల్టిమేట‌మ్ జారీ చేశారు. సేవ‌ల పేరుతో రూ.10 వేలు లెక్క‌న ఓ కోటి రూపాయ‌లు ఖ‌ర్చు పెడితే అసెంబ్లీ సీటు ఇచ్చేస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌కి ముందు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చేస్తూ, ట్ర‌స్టుల పేరుతో సేవా కార్య‌క్ర‌మాల‌తో హడావుడి చేసి, తీరా టికెట్ ద‌క్క‌క‌పోతే మ‌రి క‌నిపించ‌రంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ మంత్రి ఆక్రోశం అంతా టీడీపీలో ఇటీవ‌ల బాగా యాక్టివ్‌గా ప‌నిచేస్తున్న భాష్యం ప్ర‌వీణ్ అనే ఎన్ఆర్ఐపైనే. త‌న సీటుని ప్ర‌వీణ్ ఎక్క‌డ త‌న్నుకుపోతాడోన‌నే ఆందోళ‌న‌లోనే ఇలా అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు.

వాస్త‌వంగా ఎన్ఆర్ఐల‌ని తీసుకొచ్చి సేవ‌ల పేరుతో నియోజ‌క‌వ‌ర్గాల‌లో మొహ‌రించిన వారిలో ప్ర‌త్తిపాటి పుల్లారావు పేరే మొద‌ట చెప్పుకోవాలి. వైసీపీ ప్ర‌భుత్వంలో వైద్యారోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ఓ ఎన్ఆర్ఐ. 2014 ఎన్నిక‌ల‌కి ముందు ఆమెని టీడీపీలో చేర్చింది ప్ర‌త్తిపాటి పుల్లారావే. తాను తీసుకొచ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీ చేతిలో దారుణ పరాజ‌యం పాలైన పుల్లారావు, ఇప్పుడు మ‌రో ఎన్ఆర్ఐ వ‌చ్చేస‌రికి ఉలిక్కిప‌డుతున్నారు.

ఎన్ఆర్ఐల ట్ర‌స్టులు-సేవా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌త్తిపాటి పుల్లారావు వ్యాఖ్య‌లు టీడీపీలో పెనుదుమారం రేపాయి. అధిష్టానం కూడా త‌లంటింద‌ని స‌మాచారం. ఇంకేముంది, తాను అలా అన‌లేద‌ని త‌న వ్యాఖ్య‌లను వ‌క్రీక‌రించార‌ని ఆవేద‌న వెళ్ల‌గ‌క్కుతున్నారు. కొత్తవారిని, తటస్థులను గెలిపించిన చరిత్ర టీడీపీకే ఉంద‌ని, సామాన్య కార్యకర్తలతో సహా ఎన్నారైలను, వ్యాపారులను గెలిపించిన చరిత్ర టీడీపీదేన‌న్నారు. మాతృభూమిపై మమకారంతో అనేకమంది ఎన్నారైలు, వ్యాపారులు టీడీపీకి సహకరిస్తున్నార‌ని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడే వారి త్యాగాలను పార్టీ గుర్తిస్తుందంటూ క‌వ‌ర్ చేశారు. మొత్తానికి పుల్లారావుకి త‌త్వం బోధ‌ప‌డింద‌న్న మాట‌.

First Published:  8 Jun 2023 11:59 AM GMT
Next Story