Telugu Global
Andhra Pradesh

మేం వస్తే రాష్ట్రం పేరు కూడా మార్చేస్తాం..!

వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ బిల్లుల్ని అడ్డగోలుగా ఆమోదించుకుంటోందని ధ్వజమెత్తారు నారా లోకేష్. విపక్షానికి భయపడి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే పెట్టారని అన్నారు.

మేం వస్తే రాష్ట్రం పేరు కూడా మార్చేస్తాం..!
X

అధికారంలో ఉన్నంత మాత్రాన అన్ని పేర్లు మార్చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు నారా లోకేష్. మేం అధికారంలోకి వస్తే అన్ని పేర్లు మార్చేస్తే ఏమవుతుంది..? రాష్ట్రం పేరు మార్చేస్తే ఏమవుతుంది..? అని నిలదీశారాయన. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇది యావత్ తెలుగుజాతిని బాధపెట్టే నిర్ణయం అని అన్నారు లోకేష్. వర్శిటీ పేరు మార్చడాన్ని వైసీపీ నేతలు కూడా ఇష్టపడటం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్‌ పేరు పెడతామన్నారు లోకేష్. ఏ ఆత్మతో మాట్లాడి సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ బిల్లుల్ని అడ్డగోలుగా ఆమోదించుకుంటోందని ధ్వజమెత్తారు నారా లోకేష్. విపక్షానికి భయపడి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే పెట్టారని అన్నారు. ఎన్టీఆర్‌ పేరు ఎందుకు తొలగించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెల్త్‌ వర్శిటీకి సంబంధించిన రూ.400 కోట్ల నిధుల్ని జగన్‌ కొట్టేశారని లోకేష్ ఆరోపించారు.

వారికీ జగన్ కీ ఎంత తేడా..?

గతంలో తమిళనాడులో కూడా ఇలాంటి రాజకీయాలే జరిగేవని, అయితే, స్టాలిన్ సీఎం అయ్యాక పంతాలు, పట్టింపులు పక్కనపెట్టారని గుర్తుచేశారు. స్టాలిన్‌ సీఎం అయ్యాక అక్కడ అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్నారని చెప్పారు. జయలలిత ఫొటోలతో ఉన్న బ్యాగుల్ని కూడా మార్చకుండా స్టాలిన్, స్కూల్ పిల్లలకు పంచి పెట్టారని చెప్పారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు, హైదరాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా ఇంకా మారలేదంటే ప్రభుత్వాలు ఇంత మూర్ఖంగా వ్యవహరించలేదని గుర్తుచేశారు. కానీ ఏపీలో మాత్రం జగన్ మొండి పట్టుదలతో పేర్లు మార్చుకుంటూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. అన్న క్యాంటీన్లను తీసివేయడం దుర్మార్గం అయితే, ఎన్టీఆర్ పేరుని మార్చేసి, హెల్త్ యూనివర్శిటీ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మరింత దుర్మార్గం అని అన్నారు లోకేష్. తాము అధికారంలోకి వస్తే హెల్త్ వర్శిటీ పేరు తిరిగి మార్చేస్తామని స్పష్టం చేశారు.

First Published:  21 Sep 2022 2:56 PM GMT
Next Story