Telugu Global
Andhra Pradesh

డీఎస్పీ చైతన్యపై మరోసారి రెచ్చిపోయిన జేసీ

తమ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారని.. తన దగ్గర ఉండే దళితుడిని డీఎస్పీ చైతన్య కులం పేరుతో నోటికొచ్చినట్టు బూతులు తిట్టారని జేసీ ఆరోపించారు.

డీఎస్పీ చైతన్యపై మరోసారి రెచ్చిపోయిన జేసీ
X

తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''రేయ్ నువ్వు అనుకుంటున్నావేమో!.. ఆఫీసర్ అయితే ఏంటి ?'' అంటూ మాట్లాడారు. తమ కుటుంబంలో ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారని.. జడ్జిలు పైనుంచి ఉన్నారని జేసీ చెప్పారు. ''థూ.. నీ బతుకు.. ఎందుకు బతుకుతార్రా.. ఈ బతుకులు'' అంటూ ఫైర్ అయ్యారు.

డీఎస్పీ చైతన్య ఆగడాలపై ఎస్పీ, ఐజీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం, ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టడం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. డీఎస్పీపై కోర్టులో కేసు వేశానని చెప్పారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ. ఎమ్మెల్యే బతుకే వేస్ట్ అంటూ విమర్శించాడు. అతడికి తాడిపత్రి సరిహద్దులు కూడా తెలియదన్నారు. తాను చనిపోతే కనీసం బయటి వారు నలుగురైనా ఏడుస్తారని, మీరు పోతే ఏడ్చే వారు కూడా ఉండరన్నారు. రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక.. డీఎస్పీని అడ్డుపెట్టుకుని తన పిల్లలపైన తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తాడిపత్రికి మొదటి ముద్దాయి డీఎస్పీయేనని ఆరోపించారు. ఎమ్మెల్యే కబ్జాలకు డీఎస్పీ వంతుపాడుతున్నారని విమ‌ర్శించారు.

తమ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారని.. తన దగ్గర ఉండే దళితుడిని డీఎస్పీ చైతన్య కులం పేరుతో నోటికొచ్చినట్టు బూతులు తిట్టారని జేసీ ఆరోపించారు. ''రేయ్‌ చైతన్య .. భద్రం.. ఏం చేస్తావ్‌.. నీ ఒంటి మీద యూనిఫాం లేకుంటే నువ్వు జీరో '' అంటూ డీఎస్పీపై ఫైర్ అయ్యారు. డీఎస్పీ పెడుతున్న తప్పుడు కేసులపై విచారణ జరిపించాలని.. తప్పు తనదని తేలితే ఉరి శిక్ష‌కైనా సిద్ధమన్నారు. అధికారులు జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. సీఐడీ సునీల్ కుమార్‌ కూడా ఇలాగే రెచ్చిపోయి అందరినీ పట్టుకెళ్లి కొట్టేవాడని.. ఇప్పుడు అతడి పరిస్థితి ఏమైందో తెలుసు కదా .. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పోస్టు నుంచి పీకేశారని జేసీ వ్యాఖ్యానించారు.

గతంలో సీఎస్‌ను కూడా ఇలాగే తీసేశారని.. ఇక్కడ వైసీపీ నేతలకు వంతపాడుతున్న అధికారులకు కూడా భవిష్యత్తులో అదే పరిస్థితి వస్తుందన్నారు. ఆడవాళ్ల మీద కూడా 307 సెక్షన్లను డీఎస్పీ మోపుతుంటే ఎస్పీ, డీఐజీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. డీఎస్పీ ఇలాగే రెచ్చిపోతే శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తే తట్టుకోలేరన్నారు.

First Published:  25 Jan 2023 1:03 PM GMT
Next Story