Telugu Global
Andhra Pradesh

కేతిరెడ్డి పోస్టర్ కు జేసీ ముద్దు.. డీజిల్ దొంగ ఎవరో తేల్చాలని సవాల్

నా గుండెలో తాడిపత్రి ప్రజలే ఉంటారని చొక్కా విప్పి ప్రదర్శించారు. పెద్దారెడ్డి తాడిపత్రి మొత్తాన్ని దోచేస్తున్నాడని.. కోవిడ్ వచ్చిన రెండేళ్ల సమయంలో డీజిల్ ని స్వాహా చేశారని ఆరోపించారు.

కేతిరెడ్డి పోస్టర్ కు జేసీ ముద్దు.. డీజిల్ దొంగ ఎవరో తేల్చాలని సవాల్
X

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతుంటారు. ఇవాళ కూడా జేసీ తాడిపత్రిలో రచ్చ రచ్చ చేశారు. కొద్దిరోజుల కిందట తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరు..? అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫొటోలతో కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు నాయకులు తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్ ఇష్టానుసారంగా సొంతానికి వాడుకొని కోట్ల రూపాయలు దోపిడీ చేశారని అందులో ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తాడిపత్రిలో కలకలం రేగింది. దీంతో పోలీసులు వాటిని తొలగించారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఒకదాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తన వెంట తీసుకెళ్లారు. ఇవాళ ఆ ఫ్లెక్సీ వద్ద జేసీ మాట్లాడారు. నువ్వు, నేను ఇద్దరూ దొంగలమేనని.. నువ్వు ప్రజల సొమ్మును దోచుకున్న గజదొంగవని.. నేను తాడిపత్రి ప్రజల మనసును దోచుకున్న దొంగను.. అని జేసీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నా గుండెలో తాడిపత్రి ప్రజలే ఉంటారని చొక్కా విప్పి ప్రదర్శించారు. పెద్దారెడ్డి తాడిపత్రి మొత్తాన్ని దోచేస్తున్నాడని.. కోవిడ్ వచ్చిన రెండేళ్ల సమయంలో డీజిల్ ని స్వాహా చేశారని ఆరోపించారు. తన గురించి ఆరోపణలు చేస్తూ తాడిపత్రిలో ఎన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా జనం నమ్మరని అన్నారు. తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరో తేల్చాలని సవాల్ విసిరారు. ఇంకా ఏడాది పదవి ఉందని, అంతవరకు మాత్రమే నువ్వు దోచుకోగలవని పెద్దారెడ్డిని ఉద్దేశించి జేసీ విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడే సమయంలో బుడ్డోడా.. ఎంత ముద్దుగా ఉన్నావురా.. అంటూ పెద్దారెడ్డి పోస్టర్ ను ముద్దు పెట్టుకోవడం అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని విమర్శిస్తూ ఓ పోస్ట్ చేశారు. 'ఎస్..నేను ప్రజల మనసు దోచుకున్న దొంగను మరి నువ్వు?? భూములు, స్థలాలు, ఇసుక, అదీ ఇదీ అని తేడా లేకుండా తాడిపత్రినే దోచుకుతింటున్నావ్.. నువ్వు దొంగని తెలిసే తాడిపత్రి ప్రజలు మునిసిపాలిటీ లో నన్ను గెలిపించారు.. నువ్వు దోచుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు. మీ టైం దగ్గర పడింది!' అని ట్వీట్ చేశారు.

First Published:  30 April 2023 2:23 PM GMT
Next Story