Telugu Global
Andhra Pradesh

జీవీరెడ్డిని రామోజీరావే వెనక్కు లాగారా?

ఉండవల్లికి అందుతున్న డేటా గురించి తెలిసే మార్గదర్శి యాజమాన్యం ఆయనతో బహిరంగ చర్చపై కంగారుపడినట్టు చెబుతున్నారు. ఉండవల్లి ఊహించని అంశాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చి సమాధానం చెప్పమంటే జీవీరెడ్డి ఇరుకునపడడం ఖాయం.

జీవీరెడ్డిని రామోజీరావే వెనక్కు లాగారా?
X

మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో డిబేట్‌కు టీడీపీ నేత జీవీ రెడ్డి గట్టిగానే కసరత్తు చేశారు. ఒంటికి ఆముధం పూసుకున్న కండలవీరుడి తరహాలో కొన్ని వారాలుగా ఆయన బిల్డప్‌ ఉంటూ వచ్చింది. ఆదివారం డిబేట్‌కు రావాల్సి ఉండగా శనివారం తాను రాలేనంటూ ఉండవల్లికి మేసేజ్ చేశారు. చెప్పిన కారణం బిజీ షెడ్యూల్‌. ఈ కారణమే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రామోజీరావుకు సంబంధించి మార్గదర్శిపై చర్చ కంటే జీవీరెడ్డికి మరో ముఖ్యమైన పని ఉంటుందా?. మరో పని ఉందని రామోజీరావుకు సంబంధించిన వ్యవహారాన్ని వాయిదా వేసేంత ధైర్యం చేయగలుగుతారా?. జీవీరెడ్డికి రామోజీరావు స్థాయిలోనే బ్రేక్‌లు పడినట్టు చెబుతున్నారు. ఈ డిబేట్‌లో తాను తేలిపోతే ఇంతకాలం చేస్తున్న పోరాటం వృథా అని భావించిన ఉండవల్లి మరింత కీలక సమాచారాన్ని సేకరించేశారు. గతంలో రామోజీరావు చిట్‌ఫండ్ వ్యవహారంలో నాలుగు రోజులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ ఎదుర్కొన్న అంశాన్ని ఇటీవల ఉండవల్లి బయటపెట్టారు.

ఉండవల్లికి అందుతున్న డేటా గురించి తెలిసే మార్గదర్శి యాజమాన్యం ఆయనతో బహిరంగ చర్చపై కంగారుపడినట్టు చెబుతున్నారు. ఉండవల్లి ఊహించని అంశాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చి సమాధానం చెప్పమంటే జీవీరెడ్డి ఇరుకునపడడం ఖాయం. పైగా ఇటీవల సుప్రీంకోర్టే మార్గదర్శి ఖాతాదారుల వివరాలు బయటపెట్టాలని ఆదేశించింది. చర్చలోనూ ఉండవల్లి ఆ డిమాండ్ చేస్తే అంతే సంగతులు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై పరువు నష్టం దావా వేసిన సమయంలో మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఆ సంస్థ.. మరో సందర్భంలో మాత్రం కోర్టు ముందే సంస్థ రామోజీరావుదేనని చెప్పింది. ఇలా కోర్టును తప్పుదోవ పట్టించిన అంశంపై ఉండవల్లి ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం కష్టం.

ఇలా పలు అంశాల్లో ఏ విధంగా చూసుకున్నా ఉండవల్లితో జీవీరెడ్డి చర్చకు దిగితే మధ్యలో మార్గదర్శి మూలాలను, లోపాలను మరింత ప్రచారం చేసుకున్నట్టే అవుతుంది. అందుకే నేరుగా రామోజీరావే జీవీరెడ్డిని పిలిచి ఉండవల్లితో చర్చ అక్కర్లేదు. తాము చూసుకుంటామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

First Published:  15 May 2023 7:52 AM GMT
Next Story