Telugu Global
Andhra Pradesh

వైసీపీలోకి చిరంజీవి.. లోకేష్ పై బీసీ అస్త్రం..?

మంగళగిరిలో లోకేష్ ని మరింత ఘోరంగా ఓడించాలనే కసితో ఉన్న సీఎం జగన్ చిరంజీవికి సాదర ఆహ్వానం పలికారు, పార్టీలో చేర్చుకున్నారు. వారి వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.

వైసీపీలోకి చిరంజీవి.. లోకేష్ పై బీసీ అస్త్రం..?
X

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఆయన సీఎం జగన్ ని కలసి వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరిలో లోకేష్ ని మరింత ఘోరంగా ఓడించాలనే కసితో ఉన్న సీఎం జగన్ చిరంజీవికి సాదర ఆహ్వానం పలికారు, పార్టీలో చేర్చుకున్నారు. వారి వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.

లోకేష్ పై పోటీకి దింపుతారా..?

మంగళగిరిలో ఎలాగైనా గెలవాలనే ఉద్దశంతో లోకేష్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత నిధులు ఖర్చు పెట్టి రోడ్లు వేయిస్తున్నారు, పేదలకు సాయం చేస్తున్నారు, పెళ్లిళ్లకు శుభకార్యాలకు లోకేష్ గిఫ్ట్ పంపిస్తున్నారు. అశుభకార్యాలకు తానే నేరుగా వెళ్లి పరామర్శ చేసి వస్తున్నారు. నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. దీంతో ఈసారి లోకేష్ కి ప్రత్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికంటే కంటే బీసీ అభ్యర్థి అయితే బెటర్ అని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య మంగళగిరి నుంచి చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకి వైసీపీ ఎమ్మెల్సీ సీటిచ్చింది. దీంతో సహజంగానే ఆ వర్గం వారు వైసీపీవైపు మళ్లారు. ఇప్పుడు టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చిన అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని వైసీపీ దగ్గరకు తీసింది. ఆయనకు టికెట్ ఇస్తే గెలుపు గ్యారెంటీ అని ఆలోచిస్తోంది. వైసీపీ సంప్రదాయ ఓటుబ్యాంకుకి తోడు, చేనేత సామాజిక వర్గం ఓట్లు గుంపగుత్తగా తమకే పడతాయని ఆలోచిస్తోంది.

వైసీపీ బీసీ ప్లాన్..

బీసీలంతా టీడీపీవైపే ఉన్నారని చంద్రబాబు అంటుంటారు. కానీ బీసీలను తమవైపు తిప్పుకోడానికి వైసీపీ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు, మంత్రి వర్గంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రెండో దఫా మరిన్ని ఎక్కువ స్థానాలిచ్చారు జగన్. మంగళగిరిలో బీసీ ఓట్లు ఎక్కువ. అలాంటి చోట టీడీపీ, వైసీపీ రెండూ గత ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి వైసీపీ టికెట్ బీసీలకు ఇచ్చి, అక్కడ టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించాలనేది జగన్ ఆలోచన. లేదా మంగళగిరినుంచి ఓటమి భయంతో లోకేష్ పారిపోయి, అక్కడ టీడీపీ కూడా బీసీకే టికెట్ ఇచ్చేలా చేయాలనే ప్లాన్ కూడా వైసీపీకి ఉంది. ఈ రెండిటిలో ఏది వర్కవుట్ అయినా అది లోకేష్ కి అవమానమే. అందుకే లోకేష్ పై ముప్పేట దాడికోసం ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ప్లాన్ అమలులో పెట్టారు సీఎం జగన్.

First Published:  29 Aug 2022 8:37 AM GMT
Next Story