Telugu Global
Andhra Pradesh

ఈ ఎంపీని ఎవరు తీసుకోవట్లేదా..?

మూడుపార్టీలు కూడా రాజును పార్టీలో చేర్చుకుని ఎంపీగా టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో లేనట్లు అర్థ‌మవుతోంది. టీడీపీ, జనసేనలు దేనికదే చేయించుకున్న సర్వేల్లో రఘురాజు గెలవరని రిపోర్టు వచ్చిందట.

ఈ ఎంపీని ఎవరు తీసుకోవట్లేదా..?
X

వినటానికి విచిత్రంగానే ఉంది ఈ విషయం. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరిన తర్వాత సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడు ఇంట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు పాండా చర్చలు జరుపుతన్నారు. ఈ చర్చల్లో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని, ఎన్ని అసెంబ్లీ సీట్లలో ఎవరు పోటీచేయాలనే విషయంపై మూడుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

అయితే మిగిలిన విషయాల సంగతి ఎలాగున్నా.. ఒక విషయంలో మాత్రం మూడుపార్టీల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలోనే అట. రాజును తీసుకుని టికెట్ ఇచ్చి పోటీచేయించటానికి ఏ పార్టీ కూడా ఇష్టపడటంలేదట. ఏ పార్టీ తరఫున పోటీచేయించాలనే విషయంపైన మూడుపార్టీల నేతల మధ్య చర్చ జరిగిందట. ఆ చర్చలో రాజును మీ పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వమంటే కాదు కాదు, మీరే తీసుకుని టికెట్ ఇవ్వమని మిగిలిన రెండుపార్టీల నేతలు చెప్పారట. అంటే ఎవరికి వారు రెబల్ ఎంపీని పక్కపార్టీలోకి తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.

దీనర్థం ఏమిటంటే.. మూడుపార్టీలు కూడా రాజును పార్టీలో చేర్చుకుని ఎంపీగా టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో లేనట్లు అర్థ‌మవుతోంది. టీడీపీ, జనసేనలు దేనికదే చేయించుకున్న సర్వేల్లో రఘురాజు గెలవరని రిపోర్టు వచ్చిందట. ఆయన్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వటానికి టీడీపీ, జనసేన అధినేతలు ఇష్టపడలేదని సమాచారం. అందుకనే ఇద్దరు కలిసి బీజేపీలోనే చేర్చుకుని టికెట్ ఇవ్వమని షెకావత్ కు చెప్పారట. అందుకు షెకావత్ కూడా అభ్యంతరం చెప్పారని తెలుస్తోంది.

ఇంతకాలం చంద్రబాబు, పవన్ కు రాజుచేసిన సేవలను అయినా గుర్తంచుకోకపోవటం మరీ అన్యాయంగా ఉంది. రాజు ట్రాక్ రికార్డు బాగా తెలుసుకాబట్టే మూడుపార్టీల్లో ఏది కూడా రాజును చేర్చుకునే ఉద్దేశ్యంలో లేవని అర్థ‌మవుతోంది. కాకపోతే తనకున్న పరిచయాలను ఉపయోగించి ఏదో పార్టీలో చేరి పోటీ చేయాలని రఘురాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

మొన్న ఢిల్లీలో అమిత్ షా ఇంట్లోకి వెళదామనుకున్న రాజును సెక్యూరిటీ ఆపేసిందట. చంద్రబాబు, పవన్ తో పాటు అమిత్ షా ఇంట్లోకి వెళదామని రాజు ప్రయత్నిస్తే సెక్యూరిటీ అడ్డుకున్నారట. చంద్రబాబు, పవన్ను మాత్రమే లోపలకు పంపమని తమకు ఆదేశాలున్నట్లు స్పష్టంగా చెప్పారట. అంటే తాజా పరిస్థితికి ఢిల్లీలో ఘటన సింబాలిజమా..?

First Published:  12 March 2024 6:24 AM GMT
Next Story