Telugu Global
Andhra Pradesh

లోకేశ్‌కి హైప్ కోసం టీడీపీ ఆప‌సోపాలు - ఇప్పుడు అత‌నికి ప్రాణహాని ఉందంటూ గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేయ‌డం ద్వారా మ‌రోసారి యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు మీడియాలో హైప్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతుండ‌టం గ‌మ‌నార్హం.

లోకేశ్‌కి హైప్ కోసం టీడీపీ ఆప‌సోపాలు    - ఇప్పుడు అత‌నికి ప్రాణహాని ఉందంటూ గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు
X

టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడుకు వ‌య‌సు మీద‌ప‌డ‌టంతో తాను పాద‌యాత్ర చేయ‌లేక‌.. త‌న కుమారుడు లోకేశ్‌తో పాద‌యాత్ర చేయిస్తున్న విష‌యం తెలిసిందే. లోకేశ్‌కి మాట్లాడ‌టం చేత‌కాద‌ని, అస‌లు తెలుగే స‌రిగా రాద‌ని, స్పీచ్‌లో త‌ప్పులే కుప్ప‌లుగా వ‌స్తాయ‌ని తెలిసినా.. త‌ప్ప‌నిస‌రై అత‌నితోనే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఇక పాద‌యాత్ర మొద‌ల‌య్యాక ఏదోక రూపంలో దానిని నిత్యం హైలైట్ చేయాల‌ని ఎల్లో మీడియా కూడా రెడీ అయిపోయింది. తీరా యాత్ర తొలిరోజే నంద‌మూరి వార‌సుడు తార‌క‌ర‌త్న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డం, ఇప్ప‌టికీ ఆస్ప‌త్రిలో ఆయ‌న ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు త‌మ శ‌క్తిమేర‌కు ప్ర‌య‌త్నిస్తుండ‌టం తెలిసిందే.

తొలిరోజు నుంచే వ్య‌తిరేక ప‌వ‌నాల‌తో ప్రారంభ‌మైన లోకేశ్ పాద‌యాత్రను ఆ త‌ర్వాత కూడా జ‌నం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ పార్టీ నేత‌లు, శ్రేణులు డీలా ప‌డిపోయారు. లోకేశ్ పాద‌యాత్ర సంద‌ర్భంగా చేస్తున్న ప్ర‌సంగాల్లో విప‌రీతంగా త‌ప్పులు దొర్లుతుండ‌టంతో పొలిటిక‌ల్ షో కాస్తా.. జ‌నానికి ఫుల్లు కామెడీ షోగా మారింది. దీంతో టీడీపీ అనుకూల మీడియా కూడా లోకేశ్ పాద‌యాత్ర క‌వ‌రేజీని బాగా త‌గ్గించేసి లోప‌లి పేజీల‌కే ప‌రిమితం చేసింది.

ఇక లోకేశ్ మాట‌ల్లోని త‌ప్పుల‌ను హైలైట్ చేస్తూ.. వైఎస్సార్‌సీపీ సోష‌ల్ మీడియా `ఏందిది.. లోకేశా?` అంటూ ఫుల్లు ప్ర‌చారం చేస్తోంది. ఇక యాత్ర‌కు ఎలాగూ ప్ర‌చారం రావ‌డం లేదు.. జ‌నం కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అర్థ‌మైన చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కో.. లేక ఎల్లో మీడియా సూచ‌న‌ల మేర‌కో లోకేశ్ రోజుకోర‌కంగా యాత్ర‌లో ర‌గ‌డ సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి.. ఇరుకు రోడ్ల‌పై స‌భ నిర్వ‌హించ‌డం, ఇళ్ల పైకి ఎక్కి అక్క‌డి నుంచి మాట్లాడ‌టం, రోడ్డుపైనే కుర్చీ వేసుకొని దానిపైకి ఎక్కి మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా పోలీసులను ఇబ్బందికి గురిచేసి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించొద్దంటూ పోలీసులు విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకోవ‌డం లేదు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా వారు ఆ కార్య‌క్ర‌మాన్ని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తే త‌మ పాద‌యాత్ర‌ను పోలీసుల‌తో అడ్డుకుంటున్నారంటూ తిరిగి లోకేశే ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇప్పుడు తాజాగా ప‌లువురు టీడీపీ నేత‌లు శ‌నివారం గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. లోకేశ్‌కి ప్రాణ‌హాని త‌ల‌పెట్టే కుట్ర జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌చార ర‌థాల‌ను సీజ్ చేస్తున్నార‌ని, మైక్ కూడా లాక్కుంటున్నార‌ని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు కొల్లు ర‌వీంద్ర‌, న‌క్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాతో పాటు వ‌ర్ల రామ‌య్య కూడా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌వారిలో ఉన్నారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేయ‌డం ద్వారా మ‌రోసారి యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు మీడియాలో హైప్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతుండ‌టం గ‌మ‌నార్హం. దీనిపై వైఎస్సార్‌సీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

First Published:  12 Feb 2023 5:00 AM GMT
Next Story