Telugu Global
Andhra Pradesh

దోమలు.. మంచినీళ్లు.. ఏసీలు.. ఇప్పుడు బరువు..!

బాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దోమలు, మంచినీళ్లు, ఏసీలు అంటూ ఏదో ఒక డ్రామా చేస్తున్నారని విమర్శించారు.

దోమలు.. మంచినీళ్లు.. ఏసీలు.. ఇప్పుడు బరువు..!
X

చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన్ని బయటికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఒకపక్క కోట్లాది రూపాయలు చెల్లిస్తూ సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్లను తన తరపున వాదించేందుకు నియమించుకున్న చంద్రబాబు.. వారి ద్వారా ఎలాగైనా తాను బయటికి వచ్చేస్తానని భావించినట్టున్నారు. అయితే.. ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులలోనూ ఆయనకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న సీఐడీ పక్కాగా ఆధారాలు సేకరించడమే. దీంతో ఎంత సీనియర్‌ లాయర్లను పిలిపించి తన తరపున నియమించుకున్నా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.

మరోపక్క తెలుగుదేశం పార్టీలో అన్నీ తానే అయి నడిపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఊహించనివిధంగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. దీంతో పార్టీని నడిపే సామర్థ్యం ఉన్నవారు లేక.. ప్రజల్లోనూ ఎలాంటి సానుభూతీ రాక.. కుడితిలో పడ్డ ఎలుకల్లా ఆ పార్టీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును బయటికి తీసుకొచ్చేందుకు తమకు తోచిన రీతిలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే.. జైలులో దోమలు ఎక్కువగా ఉన్నాయని, డెంగ్యూ వంటి వ్యాధులు పబలుతున్నాయని, చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ప్రచారం చేయడం. అది ఫలితాన్నికపోవడంతో మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని, ఆయన గదిలో ఏసీ కూడా లేదని రకరకాలుగా ప్రచారం చేశారు.

తాజాగా ఆయన బరువు 5 కేజీల మేరకు తగ్గిపోయారంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ట్వీట్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో పడిందని లోకేశ్‌ కూడా ట్వీట్‌ చేశారు. అయితే శుక్రవారం దీనిపై దృష్టిపెట్టి చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలతో పాటు బరువును కూడా చెక్‌ చేయించిన జైలు అధికారులు.. బాబు బరువు తగ్గలేదని, ఒక కేజీ బరువు పెరిగారని వెల్లడించారు. బాబుకు నిత్యం ప్రత్యేక వైద్య బృందంతో ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని చెప్పారు.

ఈ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని చెప్పారు. బాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దోమలు, మంచినీళ్లు, ఏసీలు అంటూ ఏదో ఒక డ్రామా చేస్తున్నారని విమర్శించారు. అలాగే అమిత్‌ షా లోకేశ్‌ను పిలిపించినట్టు చెప్పుకొంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. పురందేశ్వరి పైనా ఆయన విమర్శలు గుప్పిస్తూ.. ఆమెను ‘ఎల్లో లోటస్‌’ అంటూ అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపు అంటూ ఆమె తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. మరోపక్క చంద్రబాబు తరపు లాయర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారని, దాని పర్యవసానమే ఏసీబీ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడటమని ఆయన చెప్పారు. న్యాయస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

First Published:  14 Oct 2023 2:03 AM GMT
Next Story