Telugu Global
Andhra Pradesh

ఎన్డీఏలోకి టీడీపీ..? తెర‌వెనుక చ‌ర్చ‌ల్లో నిజ‌మెంత‌..?

ఢిల్లీ కేంద్రంగా మాత్రం ఎన్డీఏలోకి టీడీపీ చేరే అంశంపై విస్తృత చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్డీఏలో చేర‌బోయే పాత‌మిత్రుడు టీడీపీనే అని తెలుస్తోంది.

ఎన్డీఏలోకి టీడీపీ..? తెర‌వెనుక చ‌ర్చ‌ల్లో నిజ‌మెంత‌..?
X

ఏపీలో కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయి. దీనిపై భిన్న‌మైన వార్త‌లు గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నాయి. వాస్త‌వంగా కొద్దిరోజుల క్రితం ఎన్డీఏ త‌న కొత్త మిత్రుల‌తోపాటు పాత మిత్రుల‌ను కూడా ద‌గ్గ‌ర‌కి తీసుకుంటోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై త‌మ‌కు ఎటువంటి ఆహ్వానం లేద‌ని టీడీపీ తేల్చేసింది. అంత‌కుముందు ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కూడా కొన్ని విశ్లేష‌ణ‌లు మీడియాలో వ‌చ్చాయి. ఎన్డీఏలో వైసీపీ చేర‌బోతోంద‌ని, సాయిరెడ్డి, నందిగం సురేష్‌, చింతా అనురాధ‌లు కేంద్ర‌మంత్రులు కాబోతున్నార‌ని టాక్ న‌డిచింది. ఎన్డీఏ త‌న పాత, కొత్త మిత్రుల‌తో జ‌ర‌ప‌బోయే స‌మావేశం తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వైసీపీ నుంచి ఎటువంటి ఆనంద సంకేతాలు రావ‌డంలేదు. మోడీ ఎప్ప‌టినుంచో కోరుతున్నా.. కేంద్ర‌మంత్రివ‌ర్గంలో చేరే విష‌యంలో జ‌గ‌న్ ఎప్పుడూ వ్య‌తిరేకంగా ఉన్నాడు.

ఇక్క‌డే మ‌రో కీల‌క చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్డీఏలోకి వెళ్లాల‌నుకునేది టీడీపీ. బీజేపీ తీసుకోవాల‌నుకుంటోంది టీడీపీనేన‌ని వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఎన్డీఏలోకి అకాలీద‌ళ్‌తోపాటు టీడీపీ అంటూ నేష‌న‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లే నిజ‌మ‌య్యేలా ఉన్నాయి. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పుడు ఎన్డీఏలో టీడీపీ చేర‌బోతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం కూడా అటు నుంచి బీజేపీ స్పంద‌న లేక‌పోవ‌డం, ఇటు టీడీపీ త‌మ‌కి పిలుపు లేద‌ని చెప్ప‌డంతో ఆగిపోయింది.

ఢిల్లీ కేంద్రంగా మాత్రం ఎన్డీఏలోకి టీడీపీ చేరే అంశంపై విస్తృత చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్డీఏలో చేర‌బోయే పాత‌మిత్రుడు టీడీపీనే అని తెలుస్తోంది. జూలై 18న ఢిల్లీలో ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అంత‌కంటే ముందు కొత్త‌మిత్రులు, దూర‌మైన పాత‌మిత్రుల‌తో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని స‌మాచారం.

ఢిల్లీ కేంద్రంగా బీజేపీకి చెందిన కీల‌క‌నేత‌లు, టీడీపీ కీల‌క‌నేత‌ల‌తో చ‌ర్చిస్తున్నార‌ని టాక్. వైసీపీతో బీజేపీకి మంచి స్నేహ‌సంబంధాలున్నాయి. వైసీపీ కూడా కీల‌క బిల్లుల విష‌యంలో బీజేపీ గీసిన గీత దాట‌డంలేదు. టీడీపీ మాత్రం గ‌తంలో బీజేపీతో విభేదించి బ‌య‌ట‌కెళ్లింది. బీజేపీ-టీడీపీ పొత్తు వ‌చ్చే ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నాల కోణంలో మాత్ర‌మే ఉంటుంద‌నేది కాద‌న‌లేని స‌త్యం. వ‌చ్చే స‌ర్వేలు, విశ్లేష‌ణ‌లు ప‌రిశీలించిన ఇరుపార్టీలు ఇష్టం లేక‌పోయినా కేవ‌లం ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌ట్టు క‌ట్టేందుకు సిద్ధం అవుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. వైసీపీని వ‌దులుకోవ‌డం బీజేపీకి ఇష్టంలేదు. బీజేపీతో మ‌ళ్లీ జ‌త‌క‌ట్ట‌డం టీడీపీకీ అయిష్ట‌మే. అయినా పొత్తు కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇవి కొలిక్కి వ‌చ్చి, జూలై18న ఎన్డీఏలో టీడీపీ చేర‌డం ఖాయం అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు. ఒప్పందాల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రిగితే ఎన్డీఏ కేంద్ర‌మంత్రివ‌ర్గంలోకి టీడీపీకి చెందిన ఒక ఎంపీని తీసుకుంటార‌ని వార్త‌లొస్తున్నాయి.

First Published:  11 July 2023 6:41 AM GMT
Next Story