Telugu Global
Andhra Pradesh

ఆరోపణలతో టీడీపీ ఇరుక్కుపోయిందా?

గుడివాడ క్యాసినో వ్యవహారంలో రూ.500 కోట్లు చేతులు మారినట్లు వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుతో ఐటీ రంగంలోకి దిగింది. చేసిన ఆరోపణలకు పూర్తి ఆధారాలను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది.

ఆరోపణలతో టీడీపీ ఇరుక్కుపోయిందా?
X

తెలుగుదేశం పార్టీ నేతలకు మొదటి నుండి ఒక అలవాటుంది. అదేమిటంటే ప్రత్యర్ధులపైకి గుడ్డ కాల్చి విసిరేయటం. దాన్ని తుడుచుకునేటప్పుడు చూశారా మొహమంతా మసిపూసుకున్నారు అని ఆరోపణలు చేస్తారు. ఇలాంటి రాజకీయాన్నే తమ్ముళ్ళు గడచిన 37 ఏళ్ళుగా చేస్తున్నారు. ఆరోపణలతో హోరెత్తించేస్తారు. ఏదన్నా ఆధారాలుంటే చూపించమని అడిగితే మాత్రం చాలాసార్లు మళ్ళీ ఆ ఆరోపణల గురించి మాట్లాడనే మాట్లాడరు.

ఇపుడిదంతా ఎందుకంటే ఈనెల 19వ తేదీన టీడీపీ నేత వర్ల రామయ్యతో ఐటీ ఉన్నతాధికారులు భేటీ అవుతున్నారు కాబట్టే. ఆ మధ్య సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో జరిగిందని చంద్రబాబునాయుడు అండ్ కోతో పాటు ఎల్లో మీడియా చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. రోజుల తరబడి క్యాసినో గొడవను సాగదీశారు. కొడాలి నానియే క్యాసినో నిర్వహణకు కేంద్రమంటు నానా గోల చేశారు. అయితే గుడివాడలో క్యాసినో జరగలేదని కొడాలి ఎదురుదాడి చేశారు.

సరే అదంతా రాజకీయంగా జరిగిపోయిన రచ్చ. అయితే క్యాసినో నిర్వహించి సుమారు రూ.500 కోట్లు వసూలు చేసినట్లు వర్ల రామయ్య ఐటి, ఈడీ, సీబీఐ, డీఆర్ఐ, సీబీడీటీ, కేంద్ర హోంశాఖలకు ఫిర్యాదులు చేశారు. నిజానికి టీడీపీ నేతలు చేసే ఆరోపణల్లో చాలా వరకు ఎలాంటి ఆధారాలుండవు. గాలికి పోగేసి కేవలం రచ్చచేయటం కోసమే వీళ్ళు ఆరోపణలు చేస్తుంటారు. వీళ్ళేమి మాట్లాడినా ప్రముఖంగా అచ్చేసే ఎల్లో మీడియా ఉంది కాబట్టే వీళ్ళూ రెచ్చిపోతుంటారు.

అయితే ఈ క్యాసినో వ్యవహారంలో రూ. 500 కోట్లు చేతులు మారినట్లు వర్ల చేసిన ఫిర్యాదుతో ఐటీ రంగంలోకి దిగింది. చేసిన ఆరోపణలకు పూర్తి ఆధారాలను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. విజయవాడలోని తమ ఆఫీసుకు ఈనెల 19వ తేదీన రావాలని వర్లకిచ్చిన నోటీసులో ఐటీ అధికారులు కోరారు. మీడియ సమావేశాల్లో ఆరోపణలంటే చేసేస్తారు. కానీ రూ.500 కోట్ల వ్యవహారంలో ఆధారాలను ఎలా సేకరిస్తారు? అప్పట్లో చేసిన ఆరోపణల్లో అత్యధికం ఎల్లో మీడియా వార్తల ఆధారంగానే చేశారు. కానీ రేపటి విచారణలో వాటిని ఇస్తే ఐటీ అంగీకరించదు. పూర్తి ఆధారాలను చూపమంటే అప్పుడు వర్ల ఏమి చేస్తారు ? అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.

First Published:  16 Dec 2022 8:59 AM GMT
Next Story