Telugu Global
Andhra Pradesh

స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లేనా?

ఢిల్లీలో 18న నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సమావేశానికి కేవలం ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మాత్రమే ఆహ్వానాలు పంపటంతో ఒక విషయం స్పష్టమైపోయింది. అదేమిటంటే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో మోడీ లేనట్లు అర్థ‌మవుతోంది.

స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లేనా?
X

స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లేనా?

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిత్రపక్షాల విషయంలో బీజేపీ అగ్రనేతలు స్పష్టంగానే ఉన్నట్లు అర్థ‌మవుతోంది. ఢిల్లీలో 18న నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సమావేశానికి కేవలం ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మాత్రమే ఆహ్వానాలు పంపటంతో ఒక విషయం స్పష్టమైపోయింది. అదేమిటంటే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో మోడీ లేనట్లు అర్థ‌మవుతోంది. మిత్రపక్షం హోదాలో ఎన్దీయే సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. దీంతోనే టీడీపీని బీజేపీ అగ్రనేతలు దూరం పెడుతున్నారని తేలిపోయింది.

ఇప్పటికే కర్నాటకలో దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ మిత్రపక్షంగా బీజేపీతో చేతులు కలిపింది. అలాగే పంజాబ్‌లోని అకాలీదళ్‌నుకూడా ఎన్డీయే సమావేశానికి హాజరవ్వాలని బీజేపీ అగ్రనేతలు ఆహ్వానాలు పంపారు. ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగా పాత మిత్రులను మళ్ళీ ఎన్డీయేలోకి చేర్చుకోవాలని మోడీ డిసైడ్ అయ్యారు. కాబట్టి 18న జ‌రిగే సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందుతుందని, చంద్రబాబు మళ్ళీ ఎన్డీయేలో చేరబోతున్నట్లు ఎల్లో మీడియా విపరీతంగా ఊదరగొట్టింది.

అయితే ఇప్పటివరకు టీడీపీకి ఆహ్వానం అందలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే బీజేపీతో పొత్తు పెట్టేసుకోవాలనే ఆతృత చంద్రబాబులో కూడా లేదు. ఒకప్పుడు బీజేపీతో పొత్తు కోసం విపరీతంగా వెంపర్లాడిన చంద్రబాబు ఇప్పుడు అంత ఆతృత కనబరచటంలేదు. కారణం ఏమిటంటే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి బాగా నష్టం జరుగుతుందని చాలామంది తమ్ముళ్ళు పదేపదే చెప్పటమే. దాంతో బీజేపీకి దూరంగా ఉంటేనే మేలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకనే ఎన్డీయే సమావేశం విషయంలో చంద్రబాబు పెద్దగా ఆశక్తి చూపటంలేదు. ఒకవేళ పాత ప్రయత్నాల కారణంగా ఇప్పుడు గనుక ఆహ్వానం అందితే కాదనలేరు కాబట్టి వేరేదారిలేక ఎన్డీయే సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. రోగి కోరింది..డాక్టరిచ్చింది ఒకటే మందు అన్నట్లుగా బీజేపీ అగ్రనేతలు పిలవాలని అనుకోవటంలేదు..చంద్రబాబూ వెళ్ళాలనే ఆసక్తి చూపటం లేదు. కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందో తెలియ‌దు కానీ ఇప్పటికైతే ఆహ్వానాలు పంపే విషయంలో బీజేపీ అగ్రనేతలు చాలా స్పష్టంగా ఉన్నారన్న విషయం అర్థ‌మైపోతోంది.

First Published:  17 July 2023 5:05 AM GMT
Next Story