Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు రావి షాకిచ్చారా..?

టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీలో ఉండటం ఖాయమని కూడా స్పష్టం చేశారట. చంద్రబాబుతో భేటీ సందర్భంగా అచ్చెన్న ఇదే విషయాన్ని చెప్పారట.

చంద్రబాబుకు రావి షాకిచ్చారా..?
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద షాకే ఇచ్చారట. విషయం ఏమిటంటే.. గుడివాడలో ఎవరు పోటీచేయాలన్న విషయమై రావికి పార్టీ నాయకత్వానికి మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తానే పోటీచేస్తాన‌ని రావి పట్టుబట్టారు. ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్ కు కూడా చెప్పేశారు. అయితే చంద్రబాబు, లోకేష్ కు మాత్రం రావిని కాకుండా వెనిగండ్ల రామును పోటీలో నిల‌పాల‌ని ఉంది.

దీనికి కారణం ఏమిటంటే.. వెనిగండ్ల దగ్గర బాగా డబ్బుండటమేనట. వెనిగండ్ల ఎన్ఆర్ఐ కాబట్టి బాగా సంపాదించి టికెట్ కోసమే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనాల్లో పరిచయం పెంచుకోవటం, నేతల్లో మద్దతు సంపాదించుకోవటమే టార్గెట్ గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనిగండ్ల ఆలోచన అర్థ‌మవటంతోనే పార్టీలోని చాలామంది నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. టికెట్ రావికే ఇవ్వాలని నియోజకవర్గంలోని నేతలు కూడా చంద్రబాబుతో చెప్పారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలిపించి రావితో మాట్లాడారట. వీరిమధ్య ప్రధానంగా నిధుల సమస్యే చర్చకు వచ్చిందట. ఈ విషయమై రావి మాట్లాడుతూ తన శక్తిమేరకు తాను ఖర్చులు పెట్టుకుంటానని, సరిపోకపోతే మిగిలిన బ్యాలెన్స్ ను పార్టీయే స‌ర్దుబాటు చేయాల‌ని స్పష్టంగా చెప్పారట. దశాబ్దాల తరబడి పార్టీకోసం పనిచేస్తున్న తనకు అవసరమైనప్పుడు పార్టీ ఈ మాత్రం ఖర్చు పెట్టలేదా అని అచ్చెన్నను రావి ఎదురు ప్రశ్నించారట.

టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీలో ఉండటం ఖాయమని కూడా స్పష్టం చేశారట. చంద్రబాబుతో భేటీ సందర్భంగా అచ్చెన్న ఇదే విషయాన్ని చెప్పారట. తర్వాత కొద్దిరోజులు ఆగి మళ్ళీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పంపారట. రవీంద్రతో భేటీ సందర్భంగా కూడా రావి ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. పార్టీకి ఎంతో లాయల్ గా ఉన్న తన విషయంలో చంద్రబాబు, లోకేష్ ఇలా ఆలోచించటం తప్పన్నారట. అంతగా ఇచ్చుకోవాలంటే వెనిగండ్లకే టికెట్ ఇచ్చుకోవచ్చని, తాను ఏమి చేయాలో అది చేస్తానని కొల్లుతో స్ప‌ష్టంగా చెప్పారట. అదే విషయాన్ని కొల్లు వచ్చి చంద్రబాబుకు చెప్పటంతో ఏమిచేయాలో దిక్కుతోచటంలేదని సమాచారం.

First Published:  27 July 2023 4:49 AM GMT
Next Story