Telugu Global
Andhra Pradesh

మాకు సంబంధం లేదు - తొక్కిసలాటపై టిడిపి

చంద్రబాబు నాయుడు సభ నుంచి వెళ్లిపోగానే ఒక్కసారిగా మహిళలు తోసుకొచ్చారు. దాంతోనే తొక్కిసలాట జరిగిందని టిడిపి వర్గాలు వాదిస్తున్నాయి. ఇక్కడ మరో తేడా కూడా కనిపిస్తోంది.

మాకు సంబంధం లేదు - తొక్కిసలాటపై టిడిపి
X

గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు రావడం లేదు. చంద్రన్న కానుకలు ఇస్తామంటూ ఐదున్నర గంటల పాటు మహిళలను ఎదురు చూసేలా చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకే సభ వేదిక వద్దకు తరలించారు. 30 కౌంటర్లు ఏర్పాటు చేసి కానుకలు పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ చివరకు నిర్వాహకులు చేతులెత్తేసి లారీల మీద నుంచే వాటిని పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

తొక్కిసలాట జరిగే సమయానికి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పైగా కానుకలను పంపిణీ చేసిన ట్రస్టు వైఫల్యం ఉందని టీడీపీ అనుకూల మీడియా వాదిస్తోంది. కానుకల్ని పంపిణీ చేసిన ట్రస్టు వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరు ఉన్న పత్రికలు కథనాలు ప్రచురించాయి. వార్డుల వారీగా కానుకలను పంపిణీ చేద్దామని టిడిపి నేతలు సూచించినా ట్రస్టు నిర్వాహకులు ససేమిరా అన్నారని, అందువల్లే ఈ ఘటన జరిగిందని వివరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ఇంటి వద్దకే కానుకలు ఇస్తారు కంగారు పడవద్దని మహిళలకు సూచించారని ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతోంది.

చంద్రబాబు నాయుడు సభ నుంచి వెళ్లిపోగానే ఒక్కసారిగా మహిళలు తోసుకొచ్చారు. దాంతోనే తొక్కిసలాట జరిగిందని టిడిపి వర్గాలు వాదిస్తున్నాయి. ఇక్కడ మరో తేడా కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ ఘటనకు బాధ్యత వహించే విషయంలో ముందుకు రావడం లేదు అనడానికి నిదర్శనం.. ఆ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పరిహారం ప్రకటించడం. ఉయ్యూరు ట్రస్ట్ మృతుల ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం ప్రకటించింది.

ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ ట్రస్టు నడుస్తోంది. తెలుగుదేశం పార్టీపై విమర్శల తీవ్రతను తగ్గించేందుకు ట్రస్ట్ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ కూడా ఈ దుర్ఘటనకు తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. గాయపడిన వారి ఆసుపత్రి ఖర్చులన్నీ తానే భరిస్తానని, ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తానని చెప్పారు.

ఈ ఘటనపై చంద్రబాబు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, తాను వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం దురదృష్టకరమని వివరించారు. ఉయ్యూరు ట్రస్టు ఒక్కో మృతుడి కుటుంబానికి 20 లక్షలు, తెలుగుదేశం పార్టీ ఐదు లక్షలు, ప్రభుత్వం రెండు లక్షలు, పార్టీ నేతలు మరో మూడు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించడంతో ఒక్కో మృతుడి కుటుంబానికి 30 లక్షల రూపాయల వరకు సాయం అందనుంది.

ఈ కార్యక్రమం పై మరో విమర్శ కూడా వస్తోంది కానుకల కోసం చీరలు కొన్నది పదివేల మందికి అయినప్పటికీ టోకెన్లు మాత్రం 30,000 మందికి ఇచ్చారని, పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ వారి సూచనలను నిర్వాహకులు పట్టించుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కందుకూరు చంద్రబాబు నాయుడు రోడ్ షోలో 8 మంది చనిపోవడం మరువక ముందే ఇప్పుడు చంద్రబాబు కార్యక్రమంలోనే మరో ముగ్గురు చనిపోవడం తెలుగుదేశం పార్టీలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలా వరుస ఘటనలను నేపథ్యంలో టిడిపి ఆత్మ రక్షణలో పడినట్టుగా కనిపిస్తోంది.

First Published:  2 Jan 2023 4:00 AM GMT
Next Story