Telugu Global
Andhra Pradesh

సినిమా లెవల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారా?

జగన్ పాదయాత్రకు, ఇప్పటి లోకేష్ పాదయాత్రకు షరతులు దాదాపు అవే అన్న విషయం తమ్ముళ్ళకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ‌పూర్వకంగా గోల చేసేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం జరగనిచ్చేట్లు లేదన్న గోలచేసి, హైప్ క్రియేట్ చేసి జనాలను పోగేయాలన్నదే వ్యూహంగా కనబడుతోంది.

సినిమా లెవల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారా?
X

సినిమా రిలీజుకు ముందు యూనిట్‌వాళ్ళు చాలా హైప్ క్రియేట్ చేస్తారు. సినిమాలో విషయం ఉందా లేదా అన్నది రిలీజ్ తర్వాత కానీ జనాలకు తెలీదు. ముందైతే అందులో ఏమో ఉంది అని జనాలు అనుకుని టికెట్లు బుక్ చేసుకునేట్లు యూనిట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకు సినిమా చూసిన తర్వాత కాని డబ్బులు గిట్టుబాటయ్యిందా లేదా అన్నది అర్థంకాదు.

ఇప్పుడిదంతా ఎందుకంటే 27వ తేదీన కుప్పంలో మొదలవ్వబోయే లోకేష్ పాదయాత్ర విషయం గురించే. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని కొద్దిరోజులు నానా రచ్చచేశారు. తీరా అనుమతి ఇచ్చిన తర్వాత పాదయాత్రకు షరవుతులు విధిస్తారా? అంటు గోల చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని, వైసీపీ వణికిపోతోందని తమ్ముళ్ళు వరసబెట్టి నానా రచ్చ చేస్తున్నారు. ఎల్లో మీడియాలో కూడా లోకేష్ పాదయాత్రకు షరతుల సంకెళ్ళంటూ విపరీతమైన బురదచల్లేస్తోంది.

నిజానికి లోకేష్ పాదయాత్రకు కొత్తగా పోలీసులు పెట్టిన షరతులు ఏమీలేవని జగన్ మీడియా చెబుతోంది. 2017లో జగన్ పాదయాత్రకు ముందు పోలీసులు ఎలాంటి షరతులను విధించి అనుమతులు ఇచ్చారో అవే షరతులను ఇప్పుడు పోలీసులు విధించారని వివరణ ఇచ్చింది. జగన్ పాదయాత్రకు పోలీసులు పెట్టిన షరతుల కాపీలను కూడా చూపిస్తోంది. ఇప్పుడు పెట్టిన షరతులైనా అప్పుడు విధించిన షరతులైనా దాదాపు సేమ్ టు సేమ్. ట్రాఫిక్ జనాన్ని నియంత్రించటం, శాంతిభద్రతల నిర్వహణ, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లను కూడా టీడీపీనే సమకూర్చునేట్లయితే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు అంటూ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరివే నిబంధనలను జగన్ పాదయాత్ర సందర్భంగా అప్పటి డీజీపీ సాంబశివరావు విధించారు కదా. జగన్ పాదయాత్రకు, ఇప్పటి లోకేష్ పాదయాత్రకు షరతులు దాదాపు అవే అన్న విషయం తమ్ముళ్ళకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ‌పూర్వకంగా గోల చేసేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం జరగనిచ్చేట్లు లేదన్న గోలచేసి, హైప్ క్రియేట్ చేసి జనాలను పోగేయాలన్నదే వ్యూహంగా కనబడుతోంది. ఇప్పుడు సృష్టిస్తున్న హైపంతా లోకేష్‌లో విషయం ఉందో లేదో పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తేలిపోతుంది. ఇంతోటి దానికి ఈ గోలంతా ఎందుకో అర్థం కావటంలేదు.

First Published:  26 Jan 2023 5:25 AM GMT
Next Story