Telugu Global
Andhra Pradesh

ఏపీ అప్పులు: టీడీపీ కంఠశోష.. జనాలకు విసుగు

అప్పులు తేకపోతే సంక్షేమం ఎలా..? అప్పులు చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనుకుంటే అక్కడ అధికారంలో వైసీపీ ఉంటే ఏంటి.. టీడీపీ ఉంటే ఏంటి..? ఈ లాజిక్ లతోటే ఇప్పుడు టీడీపీ వెనకపడిపోయింది.

Andhra Pradesh debt in 2022
X

ఏపీ అప్పులు: టీడీపీ కంఠశోష.. జనాలకు విసుగు

"వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో 6.38 లక్షలకోట్ల రూపాయల అప్పు చేసింది. అప్పులు 3.98 లక్షల కోట్లు, హాఫ్ బడ్జెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వీటికి అదనం. జగన్ ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి ఏపీ అప్పు రూ.11 లక్షల కోట్లకు చేరుకుంటుంది." మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తాజా వ్యాఖ్యలివి. అక్కడితో ఆగలేదాయన. సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఇలాంటి బహిరంగ చర్చలు, రాజకీయ సన్యాసాలు అనేవి కేవలం నాయకుల మాటల్లోనే ఉంటాయని, చేతల్లో అవి సాధ్యం కావనేది ప్రజలందరికీ తెలుసు. వాస్తవానికి ఏపీ ప్రజలు కూడా వైసీపీ చేస్తున్న అప్పుల్ని లైట్ తీసుకుంటున్నట్టే అనుకోవాలి.

ఏపీలో సామాన్యుడి తలమీద ఎంత అప్పుందంటే.. అని మొదలు పెట్టే ఏ ప్రసంగం అయినా జనాలకు విసుగు తెప్పిస్తుంది. ఎంత అప్పుంటే ఏముంది.. అమ్మఒడి ఠంచనుగా వస్తుంది కదా, ఒకటో తేదీన పింఛన్ చేతిలో పడుతుంది కదా, ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాల ఫలాలు కూడా సకాలంలో అందుతున్నాయి కదా. అదే వారికి కావాల్సింది. అవన్నీ టైమ్ కి వస్తున్నప్పుడు ఏపీకి ఎంత అప్పు ఉంటే ఏంటి.. జనంపై ఎంత భారం ఉంటే ఏంటి..? ఆ మాటకొస్తే అసలు అప్పులు లేకుండానే టీడీపీ ప్రభుత్వాన్ని నడిపిందా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మరోవైపు వైసీపీనుంచి కూడా ఓ లాజిక్ వినిపిస్తోంది. గతంలో ఇదే బడ్జెట్ ఉండేది, అప్పుడు అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు తాము చేసి చూపిస్తున్నామంటున్నారు జగన్. టీడీపీ చేసిన అప్పులకంటే తాము తక్కువే చేస్తున్నామని కూడా చెబుతున్నారు. మరి జనం జగన్ మాట నమ్ముతారా లేదా..?

అప్పుల కుప్ప అంటే ఓట్లు రాలతాయా..?

జగన్ పాలన బాగోలేదు అని ప్రజల్ని నమ్మించాలనుకుంటున్న టీడీపీ, ఏపీ అప్పుల కుప్పలా తయారైందని ప్రచారం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ చేస్తున్న తప్పేంటంటే సంక్షేమ కార్యక్రమాలను తాము కూడా అమలు చేస్తామని చెప్పడం. మరి అప్పులు తేకపోతే సంక్షేమం ఎలా..? అప్పులు చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనుకుంటే అక్కడ అధికారంలో వైసీపీ ఉంటే ఏంటి.. టీడీపీ ఉంటే ఏంటి..? ఈ లాజిక్ లతోటే ఇప్పుడు టీడీపీ వెనకపడిపోయింది.

కాగ్ లెక్కలు గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని కూడా వేలెత్తి చూపించాయి. అప్పుడు వాటిని పట్టించుకోని ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కాగ్ పేరు చెప్పి వైసీపీని బోనులో నిలబెడతామంటే ఎలా..? పంటి ఆపరేషన్ కోసం ప్రజా ధనంతో విదేశాలకు వెళ్లాలనుకున్న యనమల వంటి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా..? బహిరంగ చర్చకు సిద్ధమంటే ఎవరైనా లెక్కలోకి తీసుకుంటారా..? వైసీపీ కూడా ఇలాంటి ఆరోపణల్ని పూర్తిగా లైట్ తీసుకుంటోంది. అయితే సంక్షేమ పథకాల అమలులో ఎక్కడైనే తేడా వస్తే మాత్రం వైసీపీ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే లెక్క. అప్పటి వరకూ అప్పుల లెక్కల ప్రభావం ప్రభుత్వంపై ఉండకపోవచ్చు.

First Published:  25 Dec 2022 4:06 PM GMT
Next Story