Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్నీ గుర్తుకొస్తాయా..?

ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలాపన్ను కట్టలేదని అయ్యన్నను అరెస్టు చేయలేదు. 2 సెంట్ల ఇరిగేషన్ శాఖ భూమిని కబ్జాచేశారని, కబ్జాచేయటంతో పాటు కొన్ని డాక్యుమెంట్లలో అధికారుల సంతకాలను ఫోర్జరీచేశారని అయ్యన్నతో పాటు కొడుకు విజయ్ ను అరెస్టుచేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్నీ గుర్తుకొస్తాయా..?
X

ప్రజాస్వామ్యం, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం, చట్టం, న్యాయం, ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడే గుర్తుకొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు 40ఇయర్స్ ఇండస్ట్రీకి ఇవేవి గుర్తుకురావు. ఇప్పుడిదంతా ఎందుకంటే మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసినందుకే. అయ్యన్న అరెస్టుపై చంద్రబాబు మాట్లాడుతు ప్రజల ప్రాథమిక హక్కులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాతరేస్తోందంటు మండిపోయారు. 2 సెంట్ల భూమికి నాలాపన్ను కట్టలేదని 70 ఏళ్ళ వయస్సున్న అయ్యన్నను అరెస్టు చేస్తారా అంటూ ఊగిపోయారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలాపన్ను కట్టలేదని అయ్యన్నను అరెస్టు చేయలేదు. 2 సెంట్ల ఇరిగేషన్ శాఖ భూమిని కబ్జాచేశారని, కబ్జాచేయటంతో పాటు కొన్ని డాక్యుమెంట్లలో అధికారుల సంతకాలను ఫోర్జరీచేశారని అయ్యన్నతో పాటు కొడుకు విజయ్ ను అరెస్టుచేశారు. ఇదే విషయమై విచారణ చేయాలని గతంలో పోలీసులు ఎంతప్రయత్నించినా తండ్రి, కొడుకులు అవకాశం ఇవ్వలేదు. పోలీసులు తమింటికి వచ్చినప్పుడల్లా తప్పించుకుని పారిపోతున్నారు. అందుకనే తెల్లవారుజామున ఇంటికెళ్ళి అరెస్టు చేయాల్సొచ్చింది.

ఇక అరెస్టులంటారా చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు. అనారోగ్యంతో ఉన్నారని డాక్టర్లు చెప్పినా పోలీసులు వినలేదు. అలాగే సోషల్ మీడియాలో తనతో పాటు లోకేష్ పై వ్యంగ్యంగా పోస్టులు పెట్టారని చంద్రబాబు ఎంతోమందిని అరెస్టులు చేయించారు. ఆ అరెస్టులు అర్ధరాత్రుళ్ళే జరిగాయి. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని గుంటూరు బహిరంగసభలో ముస్లిం యువకులు నినాదాలు చేసినందుకు తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకుని రోజుల తరబడి పోలీసుస్టేషన్లో చావగొట్టించారు.

ఇలా చెప్పుకుంటుపోతే చాలానే ఉన్నాయి చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకాలు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. 2 సెంట్ల భూమికి నాలా కట్టకపోతే అరెస్టుచేస్తారా ? అని చంద్రబాబు అడగటంలోనే అయ్యన్న తప్పుచేశారని అంగీకరిస్తున్నట్లే ఉంది. తప్పుఎవరుచేసినా తప్పే అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. తాను అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే మరోలాగ వ్యవహరించటం మొదటినుండి చంద్రబాబుకు అలవాటే.

First Published:  4 Nov 2022 5:29 AM GMT
Next Story