Telugu Global
Andhra Pradesh

పాదయాత్రలో ముద్దులు.. గెలిచాక పిడిగుద్దులు.. సీఎం జగన్‌పై చంద్రబాబు విసుర్లు

బాబాయ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ కావడం సీఎం జగన్‌కు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకాను ఎవరు..? ఎందుకు..? చంపారనే విషయం వెలుగులోకి రావాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పాదయాత్రలో ముద్దులు.. గెలిచాక పిడిగుద్దులు.. సీఎం జగన్‌పై చంద్రబాబు విసుర్లు
X

వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరాన్ని ముంచేస్తారని తాను ఆనాడే చెప్పినా ఎవరూ వినలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో తెలుగుదేశం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బుధవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు.

విజయరాయి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. `బాబాయ్ హత్య కేసు` తెలంగాణకు బదిలీ కావడం సీఎం జగన్‌కు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకాను ఎవరు..? ఎందుకు..? చంపారనే విషయం వెలుగులోకి రావాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండే అర్హత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నా మాట వినకపోతే ఇక మీ ఇష్టం..

`ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరించాలనే 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమం తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రజలు ఇప్పటికైనా నా మాట వింటారనే. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి ఛాన్స్. నా మాట వినకపోతే ఇక మీ ఇష్టం` అని చంద్రబాబు అన్నారు. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే పదవితో పని లేదు. 40 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాను. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశాను. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు. కేవలం రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. ధైర్యంగా ముందుకు వెళ్లాలనే ఇలాంటి కార్యక్రమం చేపట్టానని అన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం పనులు పూర్తి చేశాము. నెలకు ఒకసారి పోలవరం వచ్చే వాడిని.. సోమవారాన్ని పోలవరంగా మార్చాను. అనేక సమీక్షలు చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగెత్తించాను. గేట్లు పెట్టేంత వరకు నేనే పనులు చేపించాను. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి పోలవరాన్ని గోదావరిలో ముంచారని జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరందేది. కానీ, ఇప్పుడు పోలవరం పూర్తి కాకపోవడానికి నేనే కారణమని అంటున్నారు.

మూడున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టి వేధిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. నా బాధంతా రాష్ట్రం గురించే కాని, వ్యక్తిగత స్వార్థం కోసం కాదని చంద్రబాబు అన్నారు. ఈ సారి తప్పకుండా టీడీపీని గెలిపించాలని.. మీకిదే ఆఖరి ఛాన్స్ అంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.

First Published:  30 Nov 2022 12:43 PM GMT
Next Story