Telugu Global
Andhra Pradesh

టీడీపీకి మైనారిటీలే దొరకటం లేదా?

ముగ్గురు మైనారిటీ నేతలకు టికెట్లిస్తే ముస్లింల ఓట్లన్నీ టీడీపీకే పడతాయని చంద్రబాబు ఆలోచన. అయితే సీనియర్ తమ్ముళ్ళు బాగా ఆలోచించి నియోజకవర్గాలను జల్లెడ పట్టిన తర్వాత తేలింది ఏమిటంటే నంద్యాలలో తప్ప ఇంకెక్కడా గట్టి మైనారిటీ నేతలు లేరని.

టీడీపీకి మైనారిటీలే దొరకటం లేదా?
X

రాయలసీమలో తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయటానికి గట్టి ముస్లిం మైనారిటీ నేతలే దొరకటంలేదు. రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో కనీసం 20 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు బాగానే ఉన్నాయి. అందుకనే ముస్లింల ఓట్లు రాబట్టాలంటే రాబోయే ఎన్నికల్లో కనీసం మూడు నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీలకు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అందుకని ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం మైనారిటీలకు అనుకూలంగా ఉంటుందో చూడమని సీనియర్ తమ్ముళ్ళకు పురమాయించారట. మామూలుగా మైనారిటీలంటే కడప, కర్నూలు జిల్లాల్లోనే ఎక్కువగా పోటీచేస్తుంటారు.

పై జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో మైనారిటీలు బలంగా ఉన్నారు. కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వీటితో పాటు హిందుపురం, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో కూడా ముస్లింల ఓట్లు బాగానే ఉన్నాయి. ముగ్గురు మైనారిటీ నేతలకు టికెట్లిస్తే ముస్లింల ఓట్లన్నీ టీడీపీకే పడతాయని చంద్రబాబు ఆలోచన. అయితే సీనియర్ తమ్ముళ్ళు బాగా ఆలోచించి నియోజకవర్గాలను జల్లెడ పట్టిన తర్వాత తేలింది ఏమిటంటే నంద్యాలలో తప్ప ఇంకెక్కడా గట్టి మైనారిటీ నేతలు లేరని.

అందుకనే వెంటనే నంద్యాల ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని తీసేసి ఇక్కడ మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను ఇన్‌చార్జిని చేశారు. కర్నూలు నుండి టికెట్ల కోసం ఇద్దరు ముగ్గురు నేతలు వచ్చినా వాళ్ళు లాభంలేదని చంద్రబాబు తేల్చేశారు. దాంతో వేరే నియోజకవర్గంలో ఎక్కడా గట్టి ముస్లిం మైనారిటీ నేతలే కనబడడటంలేదని పార్టీలో టాక్ వినబడుతోంది. 40 ఏళ్ళ వయసు ఉన్న‌ పార్టీకి రాయలసీమలో పట్టుమని పది మంది మైనారిటీ నేతలు లేరంటేనే ఆశ్చర్యంగా ఉంది.

ఎమ్మెల్యేగా పోటీచేసేంత స్థాయి ఉన్న గట్టి అభ్యర్థులు దొరకటం లేదంటే కచ్చితంగా అది చంద్రబాబు ఫెయిల్యూరనే చెప్పాలి. అందుకనే గడచిన రెండు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థుల్లో ఒక‌రు కూడా గెలవటంలేదు. పార్టీకి ముస్లింల్లో పట్టుపోయిందన్న విషయం అర్థ‌మైపోతోంది. కారణం ఏమిటంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆ తర్వాత మరచిపోవటమే. అందుకనే ముస్లింలందరు గంపగుత్తగా వైసీపీకే ఓట్లేసి గెలిపిస్తున్నారు. మరి చివరకు టీడీపీకి ముస్లిం అభ్యర్థులు దొరుకుతారో లేదో చూడాలి.

First Published:  28 Nov 2023 5:42 AM GMT
Next Story