Telugu Global
Andhra Pradesh

చివరకు నోటిఫికేషన్లపై కూడా ఏడుపేనా..?

టీడీపీ హయాంలో ఎన్ని డీఎస్సీలు వేశారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో గంటా స్పష్టం చేసి ఉంటే.. ఆయన వాదనలో పస ఉండేది.

చివరకు నోటిఫికేషన్లపై కూడా ఏడుపేనా..?
X

ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేయాలి..? ఏ టైమ్ లో భర్తీ చేయాలి..? దీనికి ముహూర్తాలు, సెంటిమెంట్లు ఏవీ ఉండవు. ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, దానికి తగ్గ నివేదికలు అధికారులు సిద్ధం చేస్తే వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు ఒకరోజు వ్యవధిలో విడుదలయ్యాయి. ఇక చూడండి టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఏడుపు.. ఓ రేంజ్ లో ఏడ్చి గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల టైమ్ లో గురిచూసి నోటిఫికేషన్లు వదిలారంటూ రాద్ధాంతం చేస్తున్నారు.

గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగానే, గ్రూప్-1 ని ఎందుకు తొక్కిపెట్టారంటూ ఈనాడు ఆర్టికల్ వేసింది. గ్రూప్-1 కూడా విడుదల చేయడంతో.. పాత సిలబస్ ప్రకారం పరీక్ష ఎలా పెడతారంటూ కొత్త పల్లవి అందుకుంది. ఈనాడులో వార్తలు పడగానే.. టీడీపీ నేతలు కూడా నోటికి పనిచెప్పారు. సరిగ్గా ఎన్నికలముందు నోటిఫికేషన్లు ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. తాజా నోటిఫికేషన్లను రాజకీయ ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో పెడితే, మెయిన్స్ కొత్త ప్రభుత్వం వచ్చాక నిర్వహించాల్సి ఉంటుందని, ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ కూడా ఉండవని.. నిరుద్యోగుల భవిష్యత్తుని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.

గంటా వాదనలో లాజిక్ ఉన్నా.. నోటిఫికేషన్ల విడుదల ఆలస్యం కావడానికి వెర్టికల్ రిజర్వేషన్ అనే అంశం అసలు కారణం అని ఉద్యోగార్థులకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రిజర్వేషన్లపై కోర్టు తీర్పుని గౌరవిస్తూ జీవో-77 విడుదల చేసి హారిజాంటల్ రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీతో ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల వేళ నోటిఫికేషన్లేంటంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. మరి టీడీపీ హయాంలో ఎన్ని డీఎస్సీలు వేశారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో గంటా స్పష్టం చేసి ఉంటే.. ఆయన వాదనలో పస ఉండేది. ఆ వివరాలు చెప్పకుండా వైసీపీ హయాంలో విడుదలైన నోటిఫికేషన్లపై విమర్శలు చేయడం.. ఒకరకంగా టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకోవడమే. పైగా.. 2024 చంద్రన్న ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం మరోసారి నిరుద్యోగుల్ని వంచించడమే అవుతుంది.

చివరకు నోటిఫికేషన్లపై కూడా ఏడుపెందుకని సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు పడుతున్నాయి. టీడీపీ హయాంలో మంచి చేయకపోగా, వైసీపీ హయాంలో జరుగుతున్న మంచిని చూసి ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఎన్నికలు ఉన్నాయా అని సూటిగా అడుగుతున్నారు. గ్రూప్స్ పరీక్షలపై రాద్ధాంతం చేయడం ఇకనైనా ఆపేయాలంటున్నారు.

First Published:  9 Dec 2023 12:12 PM GMT
Next Story