Telugu Global
Andhra Pradesh

తెలుగుదేశం నేతలకు జనసేన జ్వరం

పొత్తు లేకపోతే మళ్లీ అధికారం దూరం అవుతుందని తెలుగుదేశం అధిష్టానం ఆందోళనలో ఉంటే, పొత్తు ఖరారైతే తమ స్థానాలు ఎక్కడ మిత్రపక్షానికి పోతాయే అనే ఆందోళనలో టిడిపి ఆశావహులు టెన్షన్లో ఉన్నారు.

తెలుగుదేశం నేతలకు జనసేన జ్వరం
X

ఎన్నికలున్నా, లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడి వేడిగా సాగుతూ ఉంటాయి. పొత్తులు, ఎత్తుల వ్యూహాలతో పొలిటికల్ ట్రిక్స్ నడుస్తూనే ఉంటాయి. తాము ఒంటరిగా పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి తన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం పొత్తులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో టిడిపి నేతల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు టిడిపి అభ్యర్థులు అయోమయంలో ఉంటున్నారు. జనసేనతో టిడిపి పొత్తు ఖరారు అయ్యిందని కీలక నేతలకు సమాచారం ఉంది. పొత్తులో ఎన్ని స్థానాలు జనసేనకి ఇస్తున్నారు అనేది మాత్రం తెలియడం లేదు.

బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం టిడిపి 30 అసెంబ్లీ స్థానాలు జనసేనకి ఇవ్వనుందట. జనసేన డిమాండ్ ఏంటో తెలియడం లేదు. జనసేన అధినేత తాను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూనే ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు. అలా అయితే జనసేన-టిడిపి పొత్తు చిగురించకుండానే చిత్తు అయ్యే అవకాశం ఉంది. పరస్పరం అవగాహనకి వచ్చి అలయెన్స్ కుదిరితే టిడిపి ఇస్తామన్న 30 అసెంబ్లీ సీట్లలో 30 మంది టిడిపి నాయకులకి హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. తమ సీట్లు పొత్తులో పోతే, రెబల్స్ కావొచ్చు, ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొచ్చు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు విషయం అటు తేల్చుకోలేక, ఇటు తెంచుకోలేక అన్న‌ చందంగా మారింది. అలయెన్స్ ఉండడం పక్కా అని, అయితే ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు మాత్రమే సీట్లు పంపకాలు సంగతి తేలుస్తారని కొందరు నేతలు చెబుతున్నారు. పొత్తు లేకపోతే మళ్లీ అధికారం దూరం అవుతుందని తెలుగుదేశం అధిష్టానం ఆందోళనలో ఉంటే, పొత్తు ఖరారైతే తమ స్థానాలు ఎక్కడ మిత్రపక్షానికి పోతాయే అనే ఆందోళనలో టిడిపి ఆశావహులు టెన్షన్లో ఉన్నారు.

First Published:  4 Dec 2022 2:17 PM GMT
Next Story