Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు, పవన్ దొరికిపోయారా?

వ్యక్తిగత వివరాల కోసం అధికార పార్టీ నేతలు లేదా వలంటీర్లు ఇళ్ళ వద్దకు వస్తే తరిమికొట్టండని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చాలాసార్లు పిలుపిచ్చారు. అలాంటిది ఇప్పుడు టీడీపీ, జనసేన నాయ‌కులే జనాల వ్యక్తిగత వివరాలు సేకరిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

చంద్రబాబు, పవన్ దొరికిపోయారా?
X

దొంగ ఓట్లని, జనాల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని ఇంతకాలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ గోల చేస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత వివరాల కోసం అధికార పార్టీ నేతలు లేదా వలంటీర్లు ఇళ్ళ వద్దకు వస్తే తరిమికొట్టండని వీళ్ళిద్దరు చాలాసార్లు పిలుపిచ్చారు. అలాంటిది ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల వాళ్ళే జనాల వ్యక్తిగత వివరాలు సేకరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో రెండు పార్టీల నేతలు ఇంటింటికి తిరిగి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఒకవైపు వైసీపీ, వలంటీర్లను తరిమికొట్టండని పదే పదే చెబుతున్న టీడీపీ, జనసేన పార్టీల నేతలు చాపకింద నీరులా అదే పనిచేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో వీళ్ళ నిర్వాకం బయపడింది. ఇంటింటి సర్వే పేరుతో ఈ రెండు పార్టీల నేతలు సేవామిత్ర యాప్ దగ్గర పెట్టుకుని జనాల మొబైల్ నెంబర్లు, ఆధార్ కార్డులతో పాటు ఓటర్ ఐడెంటి కార్డు నెంబర్లను తీసుకుంటున్నారు. ఈ వివరాలను సేవామిత్ర యాప్‌లో రిజిస్టర్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లక్షల రూపాయల్లో లబ్ధి జరుగుతుందని నమ్మించి జనాల వివరాలు తీసుకుంటున్నారు.

సేవామిత్ర యాప్‌లో ఇంట్లోని సభ్యుల వివరాలు రిజిస్టర్ చేయగానే సదరు కుటుంబ సభ్యుల మొబైళ్ళకి ఓటీపీ వస్తోంది. దాన్ని ఓకే చేసి క్లిక్ చేయమని చెబుతున్నారు. క్లిక్ చేయగానే సేవామిత్రలో సదరు ఓటర్ పేరుతో ఒక కార్డు జనరేట్ అవుతోంది. అందులో ఓటరు వివరాలన్నీ కనబడుతున్నాయి. దానిపై 2024 జూన్ తర్వాత బ్యాంకు ఖాతాలో నమోదయ్యే డబ్బుల వివరాలు కనబడుతున్నాయి.

ఆ సేవామిత్ర యాప్‌లోని వివరాలను ఇరు పార్టీల నేతలు ఓటర్లకు చూపించి టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే సేవామిత్రలో నమోదైన వివరాలతో ఒక కార్డును ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ వ్యవహారమంతా జనాలను ప్రలోభాలకు గురిచేసేట్లుగానే సాగుతోంది. అయితే వీళ్ళు వెళ్ళిన ఇళ్ళల్లో వైసీపీ నేతల ఇళ్ళు కూడా ఉండటంతో విషయమంతా రచ్చకెక్కింది. దాంతో రెండు పార్టీల నేతలు తేలుకుట్టిన దొంగల్లాగ ఎవరికీ కనబడకుండా మాయమైపోయారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పదేపదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్న చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి.


First Published:  23 Nov 2023 5:36 AM GMT
Next Story