Telugu Global
Andhra Pradesh

తారకరత్నను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఎన్నికల బరిలో నిలిస్తే గెలుస్తాడా?

బాలయ్య, లోకేశ్ సిఫార్సుతో తారకరత్నకు టికెట్ లభించినా.. అతడికి ప్రజల్లో ఉండే ఆదరణ ఎంత అని కార్యకర్తలు అంటున్నారు.

తారకరత్నను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఎన్నికల బరిలో నిలిస్తే గెలుస్తాడా?
X

ఏపీ రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సినీ నటుడు ఎన్టీఆర్ 1983లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత ఎంతో మంది కొత్త రాజకీయ నాయకులు పుట్టుకొని వచ్చారు. అయితే, అప్పట్లో నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ తప్ప తండ్రి వెంట రాజకీయాలు చేసిన వ్యక్తి పెద్దగా లేరు. చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి పార్టీలో చిన్నా, చితకా పదవులు ఇచ్చి నోర్లు మూయించిన విషయం రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

పురందరేశ్వరి ఒక్కరే నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబును కాదని వేరే పార్టీలోకి వెళ్లిన వ్యక్తి. ఇక హరికృష్ణ మొదట్లో విభేదించినా.. ఆ తర్వాత చనిపోయే వరకు టీడీపీతోనే ఉన్నారు. బాలయ్య ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. తన నియోజకవర్గం దాటి బయట రాజకీయాలు చేయరు. కొన్నేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్‌ అంటే టీడీపీలో చాలా క్రేజ్ ఉండేది. చంద్రబాబు తర్వాత ఆయనే పార్టీకి నాయకుడనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఏపీ రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు.. జూ. ఎన్టీఆర్‌ను వాడాల్సినంత వాడేసి పక్కన పెట్టారు. అతడు కనుక యాక్టీవ్ పాలిటిక్స్‌లో ఉంటే కొడుకు నారా లోకేశ్‌కు పెద్ద పోటీ అవుతాడనే చాకచక్యంగా పక్కన పెట్టినట్లు చెప్పుకుంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ పెద్ద నాయకుడు రావడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదని చెబుతుంటారు.

తాజాగా నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్న గుంటూరు జిల్లాలో పర్యటించారు. సాధారణంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా టీడీపీ నాయకులు చాలా హడావిడి చేస్తుంటారు. కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వారిని దగ్గరుండి చూసుకుంటారు. కానీ, తారకరత్నను మాత్రం టీడీపీ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో కొంత మంది నాయకులు మాత్రం వచ్చి తారకరత్నకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తారకరత్న చెప్పుకొచ్చారు. ఇది స్థానిక టీడీపీ నాయకులను ఆశ్చర్యపరిచింది.

గుంటూరు జిల్లా పర్యటనలో ఈ విషయం చెప్పాడు కాబట్టి రాజధాని చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాల నుంచే తారకరత్న పోటీ చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో తారకరత్నకు టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. గుంటూరు పర్యటనలో తారకరత్న వెంట పెద్దగా టీడీపీ నాయకులు లేకపోవడంతో.. చంద్రబాబుకు పెద్దగా ఆసక్తి లేదని, అందుకే అతని పర్యటనను పార్టీ శ్రేణులు పట్టించుకోలేదని తెలుస్తున్నది. అసలు పర్యటనకే ప్రాధాన్యత ఇవ్వని టీడీపీ.. అతనికి టికెట్ ఇస్తుందా? అనే డౌట్ కూడా ఉన్నది.

తారకరత్న భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఆయన టీడీపీలో టికెట్ దొరక్కపోతే వైసీపీలోకి వెళ్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పటికే వైసీపీలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారని.. కొత్తగా వచ్చే వారికి అవకాశం దొరకడం కష్టమేనని అంటున్నారు. పైగా, సొంత పార్టీ వదలి తారకరత్న వైసీపీ తరపున పోటీ చేసేంత సాహసం చేయడని కూడా చెబుతున్నారు. మరోవైపు బాలయ్య, లోకేశ్ సిఫార్సుతో తారకరత్నకు టికెట్ లభించినా.. అతడికి ప్రజల్లో ఉండే ఆదరణ ఎంత అని కార్యకర్తలు అంటున్నారు. తారకరత్నకు టికెట్ ఇచ్చినా ఆయన గెలుపుకోసం పని చేసే అభిమానులు, కార్యకర్తలు లేరని.. మరి ఏ ధీమాతో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారో ఆయనకే తెలియాలని టీడీపీలో గుసగుసలాడుకుంటున్నారు.

First Published:  20 Dec 2022 1:24 AM GMT
Next Story