Telugu Global
Andhra Pradesh

Taraka Ratna: బెంగళూరులో బాబు, బాలయ్య.. నందమూరి అభిమానుల్లో ఆందోళన

Taraka Ratna Health Condition: వైద్యులతో మాట్లాడిన అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు మీడియాకు వివరించారు. ప్రస్తుతం తారకరత్న అబ్జర్వేషన్లో ఉన్నారని, ఆయన కోలుకోడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు

Taraka Ratna: బెంగళూరులో బాబు, బాలయ్య.. నందమూరి అభిమానుల్లో ఆందోళన
X

తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు, బాలకృష్ణ బెంగళూరు చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బెంగళూరులో తారకరత్న భార్య, పిల్లలను వారు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.

అబ్జర్వేషన్లో తారకరత్న..

తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని చెబుతున్నారు వైద్యులు. నిరంతరం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నారని.. ఆయనను గుండె నిపుణులు, నరాల నిపుణులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఐసీయూలో చికిత్స కొనసాగుతోందన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

వైద్యులతో మాట్లాడిన అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు మీడియాకు వివరించారు. ప్రస్తుతం తారకరత్న అబ్జర్వేషన్లో ఉన్నారని, ఆయన కోలుకోడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు. తారకరత్న పూర్తిగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు. వైద్యులు అన్నిరకాల మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు.


తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గంటలు గడిచేకొద్దీ విషమం అనే మాటే కానీ, ఆయన కోలుకుంటున్నారనే వార్తలు మాత్రం బయటకు రావడంలేదు. దీంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం నెక్ట్స్ విడుదల చేసే తారకరత్న హెల్త్ బులిటెన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

First Published:  28 Jan 2023 3:20 PM GMT
Next Story