Telugu Global
Andhra Pradesh

పవన్‌తో పని కాదంటున్న మాజీ సీఎస్..!

కాపుల్లో సమష్టి నాయకత్వం తయారైనప్పుడే కాపులు రాజకీయంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందన్నారు. కాపులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం సరైన వ్యూహం కాదన్నారు.

పవన్‌తో పని కాదంటున్న మాజీ సీఎస్..!
X

పవన్‌ కల్యాణ్‌ను నమ్ముకుంటే కాపులు పూర్తిగా మునిగిపోవడం ఖాయమని పరోక్షంగా తేల్చేశారు తమిళనాడు మాజీ సీఎస్‌, కాపు సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్‌ రావు. రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ రావు.. కాపులకు బీసీలను దూరంగా చేసే చర్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్లను నమ్ముకుని రాజకీయాలు చేయడం కాపులకు అసాధ్యమని స్పష్టం చేశారు.

కాపుల్లో సమష్టి నాయకత్వం తయారైనప్పుడే కాపులు రాజకీయంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందన్నారు. కాపులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం సరైన వ్యూహం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాపులు పోరాటం చేయడం వల్ల ఈ సామాజిక వర్గానికి బీసీలు దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేసిన సమయంలోనే తాను ఈ విషయాన్ని ఆయనకు చెప్పానన్నారు.

ముద్రగడ ఉద్యమం కారణంగా కాపులకు బీసీలు దూరమయ్యారని వివరించారు. ఏ రాజకీయ పార్టీగానీ, ప్రభుత్వం కానీ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే అది ఉత్తిదేనన్నారు. కాపులకు రిజర్వేషన్ల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదన్నారు. 75ఏళ్లుగా కొన్ని వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నాయని.. నిజంగా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనాలే ఉంటే ఆ వర్గాల వారు ఈ పాటికి ముఖ్యమంత్రులు అయి ఉండాలి కదా అని ప్రశ్నించారు.

బీసీలను, ఇతర వర్గాలను కాపులు కలుపుకుని వెళ్లినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. 4 శాతం జనాభా ఉన్న వర్గాలే రాజ్యాధికారం చేపడుతున్నాయన్న తప్పుడు ఆలోచనలోకి కాపులు వెళ్లిపోయారని రామ్మోహన్‌ రావు అభిప్రాయపడ్డారు. తుని రైలు దహనం ఘటన వల్ల కాపులపై అల్లరిమూకలనే ముద్ర పడిపోయిందన్నారు. ప్రస్తుతం కాపు యువత రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.. ఇలాంటి నేపథ్యంలో సినిమావాళ్లను నమ్ముకుంటే రాజకీయం చేయడం అసాధ్యమని రామ్మోహన్‌ రావు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

First Published:  25 Dec 2022 3:34 AM GMT
Next Story