Telugu Global
Andhra Pradesh

ఆయన స్పందన అంత నచ్చిందా.. వైసీపీకి పృథ్వీ చురకలు..

గోరంట్ల మాధవ్ కి అంగబలం, అర్థబలం ఉందని, అందుకే ఆయన్ని వైసీపీ నేతలు వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. తనకు అలాంటివేవీ లేవు కాబట్టి, కావాలనే టార్గెట్ చేసి బయటకు పంపించార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన స్పందన అంత నచ్చిందా.. వైసీపీకి పృథ్వీ చురకలు..
X

దూకుడు సినిమాలో మీ రియాక్షన్స్ నాగార్జున గారికి బాగా నచ్చాయంటూ బ్రహ్మానందంను ఆట పట్టిస్తారు హీరో మహేష్ బాబు. అదే స్టైల్ లో గోరంట్ల మాధవ్ రియాక్షన్స్ కూడా వైసీపీ నేతలకు బాగా నచ్చి ఉంటాయని సెటైర్లు పేల్చారు ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రస్తుత జనసేన నేత పృథ్వీరాజ్. మాధవ్ వీడియోతోపాటు, ఆ వీడియో విడుదలైన తర్వాత మాధవ్ స్పందించిన తీరు కూడా వైసీపీ నేతలకు బాగా నచ్చి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇంత‌టి దౌర్భాగ్యం గతంలో ఎన్నడూ చూడ‌లేద‌న్నారు పృథ్వి.

అంగబలం, అర్థబలం..

వైసీపీలో ఇలాంటి ఆరోపణలు పృథ్వీరాజ్ తోనే మొదలయ్యాయి, క్రమశిక్షణ చర్యలు కూడా ఆయనతోనే మొదలు కావడం విశేషం. అయితే ఆయన తర్వాత ఆరోపణలు వచ్చినవారెవరిపై పార్టీ చర్యలు తీసుకోలేదు. తాజాగా మాధవ్ ఎపిసోడ్ లో కూడా పార్టీనుంచి స్పందన లేదు, ఉండవ‌ని దాదాపుగా తేలిపోయింది. ఈ దశలో పృథ్వీరాజ్ తాను గతంలో బలిపశువునయ్యానంటూ మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. గోరంట్ల మాధవ్ కి అంగబలం, అర్థబలం ఉందని, అందుకే ఆయన్ని వైసీపీ నేతలు వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. తనకు అలాంటివేవీ లేవు కాబట్టి, కావాలనే టార్గెట్ చేసి బయటకు పంపించార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

చరిత్ర తుడిచిపెట్టుకుపోయింది..

పార్లమెంటులో తెలుగు ఎంపీల‌కు ఇప్పటివరకు ఓ మంచి చ‌రిత్ర ఉండేదని, మాధవ్ వీడియోతో ఆ చరిత్ర మొత్తం తుడిచిపెట్టుకుపోయింద‌ని ఆరోపించారు పృథ్వీ. వీడియో వ్యవహారంలో వారం రోజుల పాటు మీడియా స‌మావేశాలు పెట్టిన నేత‌లు ఇప్పుడు ఏమ‌య్యార‌ని ప్రశ్నించారు. అనంత‌పురం ఎస్పీ చెబుతున్న విష‌యాలు ఒక‌దానికొక‌టి పొంత‌న లేకుండా ఉన్నాయ‌న్నారు. ఆ వీడియో ఫేక్ అని ఎలా తేల్చారో చెప్పాలన్నారు. ఎవరెవరు ఎన్నెన్ని కవరింగ్ లు చేసినా, ప్రజలకు మాత్రం ఓ అవగాహన వచ్చిందని, వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలపై వారంతా ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పారు.

First Published:  12 Aug 2022 4:14 AM GMT
Next Story