Telugu Global
Andhra Pradesh

అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం.. రంగారావు కుటుంబం శాంతి మంత్రం

స్వర్గీయ ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా, మనవళ్లుగా తాము ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నామని.. తమ కుటుంబానికి నందమూరి కుటుంబానికి అనుబంధం ఉందని.. ఆ అనుబంధాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం.. రంగారావు కుటుంబం శాంతి మంత్రం
X

అక్కినేని-తొక్కినేని వ్యాఖ్యల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నందమూరి బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ రంగారావు.. అంటూ రాగం తీసిన బాలయ్యకు ఎస్వీ రంగారావు ఫ్యాన్స్ కూడా కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కాపునాడు తరపున హెచ్చరిస్తూ లేఖలు రాశారు. ఆ తర్వాత నేరుగా ఎస్వీ రంగారావు కుటుంబం రంగంలోకి దిగింది. వారి మనవళ్లు ఓ వీడియో విడుల చేశారు. అభిమానులకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చిన్న, బాబాజీ అనే పేరుతో మనవళ్లు ఓ లేఖ విడుదల చేశారు. వివాదాల జోలికి వెళ్లొద్దని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.

స్వర్గీయ ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా, మనవళ్లుగా తాము ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నామని.. తమ కుటుంబానికి నందమూరి కుటుంబానికి అనుబంధం ఉందని.. ఆ అనుబంధాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఆయన మాటల్లో తమకు అభ్యంతరంగా ఏదీ కనపడటం లేదని, ఈ విషయాన్ని ఇంతకంటే ఎక్కువగా సాగదీయొద్దని కోరారు. అయితే వీరు అక్కినేని ప్రస్తావన తేలేదు. కేవలం రంగారావు కుటుంబ సభ్యులుగా, ఆయన పేరు మీద వస్తున్న ట్రోలింగ్ కి మాత్రమే సమాధానమిచ్చారు.

అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం..

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అక్కినేని ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. వివాదాల జోలికి వెళ్లని అక్కినేని కుటుంబంపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో అక్కినేని అభిమానులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బాలయ్య క్షమాపణ చెప్పే వరకు ఆయనను బయట తిరగనివ్వబోమన్నారు. అసలీ విషయంలో మిగతా నటీనటులు కూడా సైలెంట్ గా ఉండటమేంటని నిలదీస్తున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోడానికి ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ పెద్దలు, ఇలాంటి వివాదాల సమయంలో ఎందుకు స్పందించడంలేదన్నారు. అక్కినేని కుటుంబానికి మద్దతుగా ఎవరూ కదలి రాకపోవడం దురదృష్టకరం అని అంటున్నారు అభిమానులు. ఈ విషయంలో ఇప్పటికే నాగచైతన్య, అఖిల్ బహిరంగ లేఖలు విడుదల చేశారు. నాగార్జున స్పందన కూడా అదే అనుకోవాలి. అక్కినేని అభిమానులు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు.

Next Story