Telugu Global
Andhra Pradesh

వ‌ర‌స స‌స్పెన్ష‌న్లు..వైసీపీ వ‌ర్గాల్లో ఆందోళ‌న‌!

వైఎస్సార్ సీపీలో వరస సస్పెన్షన్లతో నాయకుల్లో భయం పట్టుకుంది. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఇంకా అధిష్టానం హిట్ లిస్ట్‌లో ఎవరున్నారనే చర్చ వైసీసీ వర్గాల్లో సాగుతోంది.

వ‌ర‌స స‌స్పెన్ష‌న్లు..వైసీపీ వ‌ర్గాల్లో ఆందోళ‌న‌!
X

ఓ వైపు ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న‌వేళ‌..అధినేత స‌మీక్ష‌లు, స‌ర్వేలు అంటూ హ‌డ‌లెత్తిస్తున్న త‌రుణంలో పార్టీలో స‌స్పెన్ష‌న్లు కొన‌సాగుతుండ‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో స‌స్పెన్ష‌న్లు చేస్తుండ‌డంతో పార్టీ నాయ‌కుల్లో అయోమ‌యం నెల‌కొంటోందంటున్నారు. ఇప్ప‌టికే పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు చూస్తుంటే ఎప్పుడు ఎవ‌రిపై ఎటువంటి చ‌ర్య‌లు ఉంటాయోన‌ని ఆందోళన వ్యక్తమ‌వుతోంది.

ఇటీవ‌ల ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డీవై దాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ ప్రకటన పేర్కొంది. అయితే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్టుగా ఎలాంటి సమాచారం అందలేదని డీవై దాస్ చెప్పారు.

తాను నాలుగేళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నానని డీవై దాస్ చెప్పారు. తాను పార్టీకి ఎప్పుడూ ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ తన కార్యాలయానికి పిలిపించుకుని పామర్రు అభ్యర్థిని గెలిపించాల‌ని కోరారని చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ తనను ఏ కార్యక్రమానికి ఆహ్వానించకపోయినప్పటికీ.. తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయలేద‌ని, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు వెళుతుండేవాడిన‌ని చెప్పారు.

ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ‌ను కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఇంకా అధిష్టానం హిట్ లిస్ట్‌లో ఎవరున్నారనే చర్చ వైసీసీ వర్గాల్లో సాగుతోంది.

First Published:  19 Oct 2022 8:17 AM GMT
Next Story