Telugu Global
Andhra Pradesh

గుంటూరులో మంకీపాక్స్ కలకలం, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం..

బాలుడి కుటుంబం ఒడిశా నుంచి ఉపాధి కోసం గుంటూరుకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతడికి ఒంటిపై దద్దుర్లు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ అబ్బాయిని ఆస్పత్రికి కీసుకెళ్లారు.

గుంటూరులో మంకీపాక్స్ కలకలం, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం..
X

దేశంలో మంకీపాక్స్ కలవరం మొదలైంది. కేరళ, ఢిల్లీలో ఆల్రడీ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇద్దరు అనుమానితుల్లో ఒకరి నమూనాలో మంకీపాక్స్ వైరస్ లేదని తేలింది, మరొకరి నమూనా రిజల్ట్ రావాల్సి ఉంది. ఈ దశలో ఇటు ఏపీలో కూడా మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదవడంతో కలకలం రేగింది. ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు గుంటూరులోని గవర్నమెంట్ జ‌న‌ర‌ల్ ఆసుపత్రిలో చేరాడు. జ్వరం, దద్దుర్లు ఉండటంతో అతడి తల్లిదండ్రులు జీజీహెచ్‌ కు తీసుకొచ్చారు. మంకీ పాక్స్‌ గా వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతని వద్ద శాంపిల్స్ సేకరించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. రిపోర్ట్ రావాలని చెబుతున్నారు.

ఒడిశా బాలుడు.. గుంటూరులో చికిత్స..

బాలుడి కుటుంబం ఒడిశా నుంచి ఉపాధి కోసం గుంటూరుకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతడికి ఒంటిపై దద్దుర్లు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ అబ్బాయిని ఆస్పత్రికి కీసుకెళ్లారు. శాంపిల్స్ సేకరించిన వైద్యులు ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ లో ఉంచారు.

అటు హిమాచల్‌ ప్రదేశ్‌ లో కూడా మంకీపాక్స్‌ కలకలం రేగింది. సోలన్‌ జిల్లాలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు నమోదయింది. బద్ది ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మంకీ పాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్నాడని అధికారులు తెలిపారు. దీంతో అతని నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌ కు పంపించారు. మూడు వారాల క్రితమే అతనికి ఇన్ఫెక్షన్‌ సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అయితే అతడు గత మూడు నెలలుగా బయటి ప్రాంతాలకు వెళ్లలేదు.

దేశవ్యాప్తంగా మంకీ పాక్స్ అనుమానిత కేసులు నమోదువుతున్న సమయంలో కేంద్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు, చికిత్సకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. ఇండియాలో మంకీపాక్స్ వైరస్ రకం.. యూరోపియన్ రకంతో పోలిస్తే భిన్నంగా ఉందని చెబుతున్నారు పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్ట్ లు. ప్రస్తుతం ఇండియాలోని మంకీపాక్స్ వైరస్ ఏ-2 రకానికి చెందినదిగా గుర్తించారు. ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

First Published:  30 July 2022 6:51 AM GMT
Next Story