Telugu Global
Andhra Pradesh

కోవిడ్ నిధుల మళ్లింపు కేసు: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిధులను ప్రభుత్వం దారి మళ్ళించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఆ నిధులను వెంటనే వెనక్కి ఇచ్చేయలంటూ ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ నిధుల మళ్లింపు కేసు: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు
X

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు తరలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవ్వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు వెలువర్చింది. ఆ నిధులు మొత్తాన్ని రెండు వారాల్లోగా తిరిగి వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఏపీ సర్కార్ ను ఆదేశించింది.

పలువురు కోవిడ్ బాధితులకు ఇంకా పరిహారం అందలేదని పిటిషనర్ పల్లా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గౌరవ్ బన్సాల్ కోర్టుకు తెలపగా ఆ విషయాన్ని పరిష్కార కమిటీకి నివేదించాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా పిర్యాదులన్నింటిని పరిష్కరించాలని పరిష్కార కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేటాయించిన సొమ్ములోంచి ఏపీ సర్కారు 1,100 కోట్ల రూపాయలు దారిమళ్లించిందంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పట్లో దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోనూ ఏపీ ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు కొంత సమయం కావాలని, ఈ అంశం పై ప్రభుత్వ అభిప్రాయం తీసుకొని కోర్టుకు వెల్లడిస్తానని ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ తెలపగా సుప్రీం కోర్టు నిరాకరించింది. తామే ఆదేశాలు జారీ చేస్తామని అప్పుడే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కోవిడ్-19 బాధితుల కుటుంబ సభ్యులకు ఎలాంటి సమయాన్ని వృథా చేయకుండా పరిహారం చెల్లించేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ''పరిహారం చెల్లించకపోవడం, వారి దావా తిరస్కరణకు సంబంధించి ఎవరైనా క్లెయిమ్‌దారుకు ఫిర్యాదు ఉంటే, వారు సంబంధిత ఫిర్యాదుల పరిష్కార కమిటీని సంప్రదించవచ్చు. మా మునుపటి ఆర్డర్ ప్రకారం చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని వృధా చేయకుండా అర్హులైన వ్యక్తులకు అందజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తున్నాము.'' అని న్యాయమూర్తులు MR షా, BV నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

First Published:  18 July 2022 9:47 AM GMT
Next Story