Telugu Global
Andhra Pradesh

మళ్లీ తెరపైకి అమరావతి.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా మరోసారి ఏపీ రాజధానిపై చర్చ జరుగుతోంది. ఈ కేసు విచారణ క్రమంలో అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ (AMRDA)కి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

మళ్లీ తెరపైకి అమరావతి.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
X

రైతుల ఆందోళన కారణంగా వార్తల్లో నిలిచిన ఏపీ రాజధాని అమరావతి అంశం.. ఇటీవల పెద్దగా లైమ్ లైట్ లో లేదు. వైసీపీ ప్రభుత్వం కూడా మూడు రాజధానులపై దూకుడుగా లేకపోవడంతో అమరావతి అంశంలో కూడా ఆందోళనలు తగ్గిపోయాయి. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి నగర నిర్మాణ డిజైన్లు తయారు చేసిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా మరోసారి ఏపీ రాజధానిపై చర్చ జరుగుతోంది. ఈ కేసు విచారణ క్రమంలో అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ (AMRDA)కి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

డిజైన్లు తీసుకుంటారా లేదా..?

టీడీపీ హయాంలో అమరావతి డిజైన్లు అంటూ చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఓ ప్రత్యేక బృందం ఇతర దేశాల్లో పట్టణాల నిర్మాణం, డిజైన్లు చూడటానికంటూ ప్రజల డ‌బ్బుతో పర్యటనలు చేసి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లు బాహుబలి డిజైన్లు అంటూ సినీ దర్శకుడు రాజమౌళితో చర్చలు జరిగాయి. ప్రజల నుంచి ఆన్ లైన్లో సలహాలు స్వీకరించారు. ఆ హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చివరకు అమరావతిలో నిర్మాణాల డిజైన్ల కోసం ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ కంపెనీ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు డిజైన్లు సిద్ధ‌మయ్యాయి. ఈలోగా ఏపీలో ప్రభుత్వం మారింది. ఆ డిజైన్లు సీఎం జగన్ వద్దకు చేరాయి.

మూడు రాజధానులతో డిజైన్లు తెరమరుగు..

అప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది. అమరావతి కేవలం శాసన రాజధానే కాబట్టి, భారీ డిజైన్లతో పనిలేదనుకుంది జగన్ ప్రభుత్వం. అందుకే సదరు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ ఇచ్చిన డిజైన్లను పక్కనపెట్టింది. డిజైన్లను పక్కనపెట్టడంతో సహజంగానే ఒప్పందం నీరుగారిపోయింది. ఆ సంస్థకు బకాయిలు కూడా చెల్లించలేదు. అన్నిటికీ బకాయిలు మిగిల్చి కుర్చీ దిగిపోయిన చంద్రబాబు, 2019 జూన్ తర్వాత ఈ సంస్థకు కూడా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఆ బకాయిలు తిరిగిచ్చే విషయంలో జగన్ సైలెంట్ గా ఉన్నారు. కంపెనీ పలు దఫాలు లేఖలు రాసినా పట్టించుకోలేదు. దీంతో ఆ కంపెనీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

First Published:  12 Aug 2022 1:25 AM GMT
Next Story