Telugu Global
Andhra Pradesh

సునీత త్రిబుల్ యాక్షన్ చేస్తున్నారా?

ఒకవైపు అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు దస్తగిరి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. ఇంకోవైపు వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటీషన్‌కు విచారణార్హతలేదని వాదిస్తున్నారు.

సునీత త్రిబుల్ యాక్షన్ చేస్తున్నారా?
X

వైఎస్‌ వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణలో మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు చూసిన తర్వాత లాయర్‌ను పెట్టుకుని సునీత త్రిబుల్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపించింది. ఒకవైపు అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు దస్తగిరి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. ఇంకోవైపు వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటీషన్‌కు విచారణార్హతలేదని వాదిస్తున్నారు. అవినాష్ బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సునీత లాయర్ లూత్రాపై రెండుమూడు సార్లు జడ్జి నరసింహా అసహనం వ్యక్తంచేయటం గమనార్హం.

అవినాష్‌కు బెయిల్ ఇవ్వకూడదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తారట. ఇప్పటికే నిందుతులు జైల్లో ఉన్నారు, సాక్ష్యులను సీబీఐ విచారించేసింది. ఈ నేపథ్యంలో సాక్ష్యులను ఎంపీ ప్రభావితం చేసేదేముంటుంది? ఇదే విషయాన్ని కోర్టు సునీత లాయర్‌ను అడిగితే సమాధానం చెప్పలేదు. అవినాష్ అరెస్టును అడ్డుకునేందుకు కర్నూలులో ఎంపీ అనుచరులు ఎన్ని ప్రయత్నాలు చేశారనే విషయాన్ని లూత్రా చెప్పే ప్రయత్నంచేశారు.

వెంటనే లూత్రాను జస్టిస్ నరసింహ అడ్డుకున్నారు. సీబీఐ తరపున కూడా మీరే మాట్లాడేస్తుంటే ఇక సీబీఐ లాయర్ ఎందుకని ప్రశ్నించారు. దాంతో లూత్రా సారి చెప్పి పక్కకు తప్పుకున్నారు. కర్నూలులో ఏమి జరిగిందనే విషయాన్ని సీబీఐ లాయర్ వివరిస్తారని నరసింహా చెప్పారు. అయితే ఆ విషయాలను వివరించేందుకు సీబీఐ లాయర్ అందుబాటులో లేరు. అయినా సరే లూత్రాను జడ్జి అనుమతించలేదు.

ఇక దస్తగిరి బెయిల్ రద్దు పిటీషన్ తరపున కూడా సునీత లాయరే వాదించటాన్ని కోర్టు అడ్డుకున్నది. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని, వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటీషన్‌కు అసలు విచారణార్హతే లేదని సునీత లాయర్ వాదించారు. విచారణార్హత ఉందా లేదా అని తాము చూసుకుంటామని జడ్జి అనటంతో సునీత లాయర్ మౌనంగా ఉండిపోయారు. బెయిల్ ఎవరికి ఇవ్వాలి, ఎవరి బెయిల్ పిటీషన్‌ను డిస్మిస్ చేయాలి, ఎవరు ఎవరి మీద కేసు వేయాలనే విషయాన్ని తానే డిసైడ్ చేయాలన్నట్లు సునీత త్రిబుల్ యాక్షన్ చేస్తున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  25 May 2023 5:45 AM GMT
Next Story