Telugu Global
Andhra Pradesh

బాలయ్య సినిమా విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

పన్ను రాయితీ పొందిన తర్వాత కూడా రేట్లు తగ్గించకుండా.. పాత ధరలకే టికెట్లను విక్రయించారు. ఈ విషయంపై వినియోగదారుల సంఘం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది.

బాలయ్య సినిమా విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
X

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. 2017లో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీ పొందారు. అయితే, పన్ను రాయితీ పొందిన తర్వాత కూడా రేట్లు తగ్గించకుండా.. పాత ధరలకే టికెట్లను విక్రయించారు. ఈ విషయంపై వినియోగదారుల సంఘం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది.

సినిమా కోసం రాయితీ తీసుకొని, వాటి బెనిఫిట్స్‌ను ప్రేక్షకులకు బదలాయించకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వయంగా సినిమా హీరో బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబును పన్ను రాయితీ కోరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. పన్ను రాయితీ పొందిన మొత్తాన్ని సినిమా నిర్మాతల నుంచి రికవరీ చేసి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో కోరారు.

తాజాగా సోమవారం ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. ఈ పన్ను రాయితీ విషయంలో వివరణ ఇవ్వాలని నటుడు బాలకృష్ణతో పాటు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, 2017లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. సినీ గోయర్స్ అవార్డు, సైమా అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నది.

First Published:  29 Aug 2022 11:40 AM GMT
Next Story