Telugu Global
Andhra Pradesh

రామోజీరావుకు నోటీసులు జారీ

ఇలా డిపాజిట్లు వసూలు చేసి ఎగ్గొట్టిన అనేక మందిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారని.. ఒక్క రామోజీరావు విషయంలో మాత్రమే అందుకు భిన్నంగా జరుగుతోందని ఉండవల్లి విమర్శించారు.

రామోజీరావుకు నోటీసులు జారీ
X

ఎట్టకేలకు ఈనాడు అధినేత రామోజీరావుకు నోటీసులు జారీ అయ్యాయి. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయింది. తాజాగా నేడు మరోసారి సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. రామోజీరావు తరహాలో డిపాజిట్లు స్వీకరించడం నేరమని.. ఒకవేళ ఈ కేసులో రామోజీరావును సమర్థిస్తే ఇక దేశంలో ఎవరైనా ఇదే తరహాలో డిపాజిట్లు సేకరించుకునే పరిస్థితి ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఇలా డిపాజిట్లు వసూలు చేసి ఎగ్గొట్టిన అనేక మందిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారని.. ఒక్క రామోజీరావు విషయంలో మాత్రమే అందుకు భిన్నంగా జరుగుతోందని ఉండవల్లి విమర్శించారు. రామోజీరావును చట్టానికి అతీతం చేయవద్దని సుప్రీంకోర్టును కోరామన్నారు. అలా చేస్తే చట్టాలకు, సమాజానికి, ధర్మానికి చాలా హాని ఉంటుందని కోర్టుకు విన్నవించామన్నారు.

తాజా విచారణలో డిపాజిటర్లకు సొమ్ము మొత్తం తిరిగి చెల్లించారా అని సుప్రీంకోర్టు అడిగందని.. అయితే ఆ విషయాన్ని పరిశీలన చేసేందుకు రామోజీరావు అవకాశం ఇవ్వలేదని వివరించామని ఉండవల్లి చెప్పారు. ఒకవేళ డిపాజిట్లు వెనక్కు ఇచ్చేసినా సరే.. అలా సేకరించిన నేరంపై చర్యలు తీసుకోవాలన్నారు. రామోజీరావు డిపాజిట్లు తాను వెనక్కు ఇచ్చేశానని చెప్పడమే కానీ.. ఆ విషయాన్ని దేశంలోని ఏ వ్యవస్థ పరిశీలన చేయలేకపోయిందన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వమే ఈ కేసులోకి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేసు ముందుకెళ్తుందని ఉండవల్లి ధీమా వ్యక్తం చేశారు. పిటిషన్లను విచారించిన కోర్టు రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

First Published:  19 Sep 2022 11:34 AM GMT
Next Story