Telugu Global
Andhra Pradesh

సూపర్ సైక్లోన్ సిత్రాంగ్.. ఏపీకి ముప్పు తప్పదా.. ?

ఈనెల 20వతేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుందనే అంచనాలున్నాయి.

సూపర్ సైక్లోన్ సిత్రాంగ్.. ఏపీకి ముప్పు తప్పదా.. ?
X

ఏపీ తీరాన్ని సూపర్ సైక్లోన్ వణికించబోతోందా.. ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏం చెబుతున్నాయి.. ? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణమ్మ పరవళ్లతో తీరప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. ఇప్పుడు సూపర్ సైక్లోన్ కూడా తోడయితే ఏపీలో మరోసారి జలవిలయం తప్పదనే అంచనాలున్నాయి. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటోంది.. ? అసలు తాజా వాతావరణ పరిస్థితి ఏంటి.. ?

ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో ముప్పు మొదలయ్యే అవకాశముంది. దానికి తోడు 20వతేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుందనే అంచనాలున్నాయి. ఆ తర్వాత తుపాన్ గా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. తుపాన్ గా మారితే దానికి ఆల్రడీ సిత్రాంగ్ అనే పేరు కూడా ముందుగానే పెట్టేశారు. సూపర్ సైక్లోన్ అవకాశాలను గ్లోబల్ ఫోర్ కాస్ట్ సిస్టమ్(GFS) గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీతోపాటు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది.

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. దీనికి సూపర్ సైక్లోన్ తోడయితే జలవిలయం ముంచుకొచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 4.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. సైక్లోన్ ప్రమాదంపై కూడా ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

First Published:  15 Oct 2022 4:27 AM GMT
Next Story