Telugu Global
Andhra Pradesh

అవినాష్ లాయర్‌పై చర్యలకు సునీత మెమో.. సుప్రీంకు మేటర్‌

వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పు కాపీని సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

YS Sunitha: అవినాష్ లాయర్‌పై చర్యలకు సునీత మెమో.. సుప్రీంకు మేటర్‌
X

అవినాష్ లాయర్‌పై చర్యలకు సునీత మెమో.. సుప్రీంకు మేటర్‌

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా వైఎస్ సునీత న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించి ముందస్తు బెయిల్ పొందారని ఆమె ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డి లాయర్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో ఆమె మెమో దాఖలు చేశారు.

అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం విషయంలో ఆయన తరపు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు. వాదనల సమయంలో అవినాష్ తల్లి ఆరోగ్యం సరిగా లేదని.. ఆమెకు సర్జరీ చేయాల్సి ఉందని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. తాము ఆమె ఆనారోగ్యం గురించి చెప్పిన విషయం అవాస్తవం అని తేలితే చర్యలు తీసుకోవచ్చని లాయర్‌ కోర్టుకు వివ‌రించారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకునే తాము తీర్పు ఇచ్చే వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే అవినాష్ రెడ్డి తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని, ఆమె ఆరోగ్యంపై తప్పుడు వివరాలు చెప్పిన అవినాష్ లాయర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సునీత ఒక మెమోను దాఖలు చేశారు. మెమో దాఖలు చేసినప్పటికీ దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పు కాపీని సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు సునీత వెళ్తారా..? లేక సీబీఐ ముందుగా వెళ్తురా..? అన్న దానిపైనా చర్చ నడుస్తోంది.

First Published:  31 May 2023 9:00 AM GMT
Next Story