Telugu Global
Andhra Pradesh

చివరకు సుజనా కూడానా?

విభజన చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే కేంద్ర మంత్రిగా సుజనా చౌదరి చూస్తూ ఊరుకున్నారు. ఐదేళ్ళల్లో ఏపీకి చేయాల్సినంత నాశనం చేసేసి ఇప్పుడు జగన్‌పై బురదచల్లుతున్నారు.

చివరకు సుజనా కూడానా?
X

ఏపీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ ఒక మాట చెబుతుంటారు. తల్లిదండ్రులను చంపేసినవాడు కూడా కోర్టులో తాను అనాథ‌నని ఏడ్చాడని..కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యవహారం కూడా అచ్చు అలాగే ఉంది. అమరావతిలో సుజనా మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిధులు, కాకినాడ పెట్రో ప్రాజెక్టు లాంటివి సాధించటంలో జగన్ ఫెయిలయ్యారంటూ మండిపడ్డారు.

టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన ఈయన 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఎన్డీయేలో టీడీపీ ఉన్నపుడు టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా కూడా కొంతకాలం ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళని చెప్పచ్చు. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడమన్నటల్లా ఆడిందే చంద్రబాబు. అప్పట్లో ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీనే ముద్దని ఒప్పుకున్నారు. 2013 సవరించిన అంచనాల ప్రకారమే పోలవరం నిధులు కావాలని అంగీకరించారు.

రైల్వే జోన్‌కు బదులు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామంటే సరే అన్నది చంద్రబాబే. కాకినాడు పెట్రో ప్రాజెక్టు గురించి చంద్రబాబు పట్టించుకోనేలేదు. అంటే విభజన చట్టానికి చంద్రబాబును చూసుకునే మోడీ ప్రభుత్వం తూట్లు పొడి చేసింది. ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్ర మంత్రిగా సుజనా చౌదరి చూస్తూ ఊరుకున్నారు. ఐదేళ్ళల్లో ఏపీని చేయాల్సినంత నాశనం చేసేసి ఇప్పుడు జగన్‌పై బురదచల్లేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాదుకాక రాదని కేంద్ర మంత్రి హోదాలో ఇదే సుజనా వంద సార్లు చెప్పుంటారు. అలాంటిది ప్రతిపక్షలోకి రాగానే, ఎంపీ పదవి అయిపోగానే చంద్రబాబులాగ సుజనాకు కూడా అర్జంట్‌గా రాష్ట్ర ప్రయోజనాలను గుర్తుకొచ్చేశాయి. ఆర్థికంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని సుజనా తెగ బాధపడిపోయారు. బ్యాంకుల నుండి వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని అప్పుల రూపంలో దోచేసుకున్న కేసుల్లో ఇరుక్కుని తిరిగి కట్టకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సుజనా కూడా ఏపీ అప్పుల గురించి, ఆర్థిక‌ పరిస్థితి గురించి బాధపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  16 March 2023 6:45 AM GMT
Next Story