Telugu Global
Andhra Pradesh

త‌ల్లి వ‌య‌సు మ‌హిళ‌పై విద్యార్థుల సామూహిక అత్యాచారం

మంచి భ‌విష్య‌త్తు కోసం శ్ర‌మించాల్సిన వ‌య‌సులో బ‌తుకునే ప్ర‌శ్నార్థ‌కం చేసుకున్నారు. తాత్కాలిక ఆవేశానికి గురై భ‌విష్య‌త్తును బుగ్గిపాలు చేసుకున్నారు. త‌మ త‌ల్లి వ‌య‌సు ఉండే వివాహిత(38)పై సామూహిక అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు.

త‌ల్లి వ‌య‌సు మ‌హిళ‌పై విద్యార్థుల సామూహిక అత్యాచారం
X

ఏమైపోతోంది మ‌న‌ స‌మాజం.. ఎటు పోతున్నారు మ‌న భావి భార‌త పౌరులు.. అని అంద‌రికీ ఆందోళ‌న క‌లిగించే దారుణ ఘ‌ట‌న ఇది. వారంతా విద్యార్థులు.. ఇద్ద‌రు తొమ్మిదో త‌ర‌గ‌తి, ఒక‌రు ప‌దో త‌ర‌గ‌తి, మ‌రొక‌రు ఇంట‌ర్ చ‌దువుతున్నారు. వీరిలో ఇద్ద‌రు మైన‌ర్లు. హాయిగా చ‌దువుకుంటూ.. మంచి భ‌విష్య‌త్తు కోసం శ్ర‌మించాల్సిన వ‌య‌సులో బ‌తుకునే ప్ర‌శ్నార్థ‌కం చేసుకున్నారు. తాత్కాలిక ఆవేశానికి గురై భ‌విష్య‌త్తును బుగ్గిపాలు చేసుకున్నారు. త‌మ త‌ల్లి వ‌య‌సు ఉండే వివాహిత(38)పై సామూహిక అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

అన‌కాప‌ల్లి జిల్లా రావిక‌మ‌తం మండ‌లం దొండ‌పూడిలో ఈ దారుణం జ‌రిగింది. ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన విద్యార్థుల‌దీ అదే గ్రామం. దొండ‌పూడిలో 38 ఏళ్ల వివాహిత త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌ల‌సి నివ‌సిస్తోంది. ఈ నెల ఆరో తేదీన దొండ‌పూడికి స‌మీపంలోని జీడిమామిడి తోట‌లోకి క‌ట్టెల కోసం వెళ్లింది. అదే స‌మ‌యంలో ఆ ప్ర‌దేశంలో సంచ‌రిస్తున్న విద్యార్థులు న‌లుగురికీ ఆమె ఒంట‌రిగా క‌నిపించ‌డంతో, వారి బుద్ధి వ‌క్ర‌మార్గం ప‌ట్టింది. ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. అంతేకాదు.. ఈ విష‌యం బ‌య‌టికి చెబితే పరువు తీస్తామ‌ని బెదిరించారు.

ఈ దారుణ ఘ‌ట‌న‌తో భీతిల్లిన ఆ వివాహిత త‌న భ‌ర్త‌తో క‌ల‌సి ఈ నెల 13వ తేదీ ఆదివారం రాత్రి కొత్త‌కోట పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సోమ‌వారం ఉద‌యం అన‌కాప‌ల్లి దిశ డీఎస్పీ మ‌హేశ్వ‌ర‌రావు, సీఐ టి.ల‌క్ష్మి, ఎస్సై శేఖ‌రం రంగంలోకి దిగి.. కొత్త‌కోట స్టేష‌న్‌లోను, దొండ‌పూడిలోను విచార‌ణ నిర్వ‌హించారు. ప్రాథ‌మికంగా ల‌భించిన ఆధారాల‌ను బ‌ట్టి న‌లుగురు నిందితుల‌పై కేసు న‌మోదు చేశారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌మ క‌ళ్ల ముందే తిరుగుతూ చ‌దువుకునే విద్యార్థులు ఇంత దారుణం చేశారా అని ఆ గ్రామ‌స్తులు విస్తుపోతున్నారు. వీరికి ఇదేం పాడు బుద్ధి పుట్టిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విశృంఖ‌లంగా అందుబాటులోకి వ‌స్తున్న అశ్లీల వీడియోల ప్ర‌భావం వీరిపై ప‌డి ఉంటుంద‌ని ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

First Published:  15 Nov 2022 3:46 AM GMT
Next Story