Telugu Global
Andhra Pradesh

కడపలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి, మరో విద్యార్థికి గాయాలు

మధ్యాహ్నం వేళ సైకిల్‌పై వెళుతుండగా స్థానిక అగాడి వీధిలో తెగి పడిన విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు.

కడపలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి, మరో విద్యార్థికి గాయాలు
X

కడప నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వీధిలో సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు విద్యార్థులు తెగి వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. కడప నగరంలోని అగాడి వీధిలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కడప నగరంలో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తన్వీర్‌ (11), ఆదాం (10) స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. మధ్యాహ్నం వేళ సైకిల్‌పై వెళుతుండగా స్థానిక అగాడి వీధిలో తెగి పడిన విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.. విద్యుత్‌ తీగలను పక్కకు తొలగించి.. విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మధ్యాహ్నం వేళ భోజనం కోసం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

First Published:  21 Aug 2024 12:44 PM GMT
Next Story