Telugu Global
Andhra Pradesh

సింహ‌పురి వైసీపీ సింహాల అస‌మ్మ‌తి గ‌ర్జ‌న‌

నీటిపారుద‌ల‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తొల‌గించిన నుంచీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ పార్టీలో ఒంట‌రి అయ్యారు. చివ‌రికి బాబాయ్ వ‌ర‌స‌య్యే రూప్ కుమార్ యాద‌వ్‌తోనూ విభేదాలు పొడ‌సూపాయి.

సింహ‌పురి వైసీపీ సింహాల అస‌మ్మ‌తి గ‌ర్జ‌న‌
X

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట‌. ఆ కోట‌కి సొంత సైన్యం వ‌ల్లే బీట‌లు ప‌డుతున్నాయి. జిల్లాల విభ‌జ‌న‌కి ముందు నెల్లూరులో ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల‌న్నీ వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఈ జిల్లాకే వైసీపీ మూడు రాజ్య‌స‌భ స్థానాల‌నూ క‌ట్ట‌బెట్టింది. విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి, బీద మ‌స్తాన్ రావులు ఎంపీలుగా కూడా వైసీపీ బ‌లోపేతంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ అంటేనే నెల్లూరు జిల్లా అనే స్థాయిలో ఇక్క‌డ పార్టీ చాలా బ‌లంగా మారింది. అధికారం మ‌హిమో, అహంకార‌మో తెలియ‌దు కానీ బ‌ల‌మైన వైసీపీని ముఠా త‌గాదాలు బ‌ల‌హీన ప‌రుస్తున్నాయి. మంత్రివ‌ర్గంలో చేర్పులు, మార్పులు త‌రువాత సింహ‌పురి వైసీపీలో అస‌మ్మ‌తి గ‌ర్జ‌న మొద‌లైంది.

నీటిపారుద‌ల‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తొల‌గించిన నుంచీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ పార్టీలో ఒంట‌రి అయ్యారు. చివ‌రికి బాబాయ్ వ‌ర‌స‌య్యే రూప్ కుమార్ యాద‌వ్‌తోనూ విభేదాలు పొడ‌సూపాయి. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంగా వున్నారు. ఇదే స‌మ‌యంలో ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి నుంచి సీటు పోటీ హాటు హాటుగా సాగుతోంది. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే అక్క‌సుతో వున్న వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి త‌మ ప్ర‌భుత్వంపైనే బ‌హిరంగ విమ‌ర్శ‌ల‌కు దిగారు. పార్టీ అధిష్టానం వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ బాధ్య‌త‌లు మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్ప‌గించింది.

గూడూరులో ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ అంటే వైసీపీ నేత‌లే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డికి అస‌మ్మ‌తి స‌మ‌స్య లేక‌పోయినా జిల్లాలో మంత్రిగా ఇత‌ర అసంతృప్త నేత‌ల‌కు స‌ర్ది చెప్ప‌డం త‌ల‌పోటు వ్య‌వ‌హారంగా మారింది. మ‌రోవైపు కోర్టులో చోరీ కేసు వెంటాడుతోంది. రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి త‌న భార్య ప్ర‌శాంతి రెడ్డిని ఏదో ఒక స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపాల‌నుకోవ‌డం రెండు స్థానాల్లో సిట్టింగుల‌కు కంటిమీద కునుకు లేదు.

ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఇటు అస‌మ్మ‌తి, మ‌రోవైపు అనారోగ్యం, ఇంకో వైపు భార్య‌ల పంచాయితీ వైసీపీకి తీవ్ర‌న‌ష్టం చేయ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. మాజీ ఎంపీపీ చేజ‌ర్ల సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో అస‌మ్మ‌తి వ‌ర్గం అధిష్టానం ద‌గ్గ‌ర పంచాయితీ పెట్టింద‌ని తెలుస్తోంది. మేక‌పాటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కేది అనుమాన‌మేన‌ని కేడ‌ర్ అంటోంది. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎమ్మెల్యే ప్ర‌తాప్ కుమార్ రెడ్డి షాడోలా సుకుమార్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో వైసీపీలో అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపిస్తున్నాయి. రాజ్య‌స‌భ స‌భ్యుడు బీద మ‌స్తాన్ రావు త‌న‌యుడు ఈ స్థానం ఆశిస్తుండ‌టంతో పోటీ తీవ్ర‌మైంది.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో గెలిచిన మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి బెంగ‌ళూరు నుంచి అప్ డౌన్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయ‌నకు నియోజ‌క‌వ‌ర్గంలో అస‌మ్మ‌తి లేక‌పోయినా ప్ర‌జ‌ల‌కు అంత ద‌గ్గ‌ర కాలేక‌పోయార‌ని తెలుస్తోంది. అస‌మ్మ‌తి బెడ‌ద పెద్ద‌గా లేని నియోజ‌క‌వ‌ర్గంగా కోవ్వూరు ఒక్క‌టే క‌నిపిస్తోంది. వైసీపీలో ఈ గ్రూపు త‌గాదాల‌కు అధిష్టానం చెక్ పెట్ట‌క‌పోతే కంచుకోట బీట‌లు వార‌డ‌మే కాదు..కుప్ప‌కూలిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

First Published:  8 Jan 2023 2:25 AM GMT
Next Story