Telugu Global
Andhra Pradesh

మహిళ పట్ల సీఐ అంజు యాదవ్ అనుచిత ప్రవర్తన

హోటల్‌ వద్దకు రాగానే సెల్ ఫోల్ లాగేసుకున్న సీఐ.. నీ భర్త ఎక్కడే అంటూ గ‌ట్టిగా అరిచారని.. తెలియదని చెప్పగా.. `మేడం అని పిలవాలని తెలియదా బూటు కాలితో తంతా..` అంటూ బూతులు తిట్టారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి చెప్పారు.

మహిళ పట్ల సీఐ అంజు యాదవ్ అనుచిత ప్రవర్తన
X

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సామాన్యులతో పాటు నాయకులనూ ఈమె లెక్క చేయరన్న విమర్శలు ఉన్నాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తెతోనూ నడిరోడ్డుపై అంజుయాదవ్ గొడవపడ్డారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ ధర్నా చేయగా.. ఎమ్మెల్యే కుమార్తెతో దురుసుగా ప్రవర్తించారు. వేలు చూపుతూ జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఊగిపోయారు. అయినా సరే అధికార పార్టీ నేతలు కూడా ఆమెను ఏమీ చేయలేకపోయారు.

తాజాగా అంజుయాదవ్‌ ఒక మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించారు. నడిరోడ్డు మీద దాడిచేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. శ్రీరాంనగర్ కాలనీలో హోటల్ నిర్వహిస్తున్న ధనలక్ష్మీ అనే మహిళపై సీఐ అంజుయాదవ్ దాడి చేశారు. ఒక కేసు విషయంలో భర్త ఆచూకీ చెప్పాలంటూ ధనలక్ష్మీని ఈడ్చుకొచ్చారు సీఐ. తనకు తెలియదని ఆమె చెబుతున్నా వినకుండా.. ఆమె చీర కొంగు జారిపోయినా సరే పట్టించుకోకుండా బలవంతంగా జీపులోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాత ధనలక్ష్మి అనారోగ్యానికి గురవ్వ‌డంతో ఆస్పత్రికి తరలించారు.

హోటల్‌ వద్దకు రాగానే సెల్ ఫోల్ లాగేసుకున్న సీఐ.. నీ భర్త ఎక్కడే అంటూ గ‌ట్టిగా అరిచారని.. తెలియదని చెప్పగా.. `మేడం అని పిలవాలని తెలియదా బూటు కాలితో తంతా..` అంటూ బూతులు తిట్టారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి చెప్పారు. తనను ఏమీ చేయవద్దు మేడం అని వేడుకున్నా వినకుండా బలవంతంగా జీవులోకి ఎక్కించి తీసుకెళ్లిందని వివరించారు.

కొద్దిరోజుల క్రితం టీడీపీ కార్యకర్తలపైన సీఐ అంజుయాదవ్ ఇలాగే వ్యవహరించారు. ఆందోళన చేస్తున్న మహిళా కార్యకర్తలను లాగేసి మగ పోలీసులకు అప్పగించారామె. తాజాగా హోటల్‌ నిర్వహిస్తున్నధనలక్ష్మిపై సీఐ అమానుషంగా వ్యవహరించిన అంశంపై పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. అసలెందుకు సీఐ అలా చేశారు? ధనలక్ష్మీ భర్త ఆచూకీని సీఐ ఏ కేసులో తెలుసుకోవాలనుకున్నారు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.

First Published:  1 Oct 2022 7:05 AM GMT
Next Story