Telugu Global
Andhra Pradesh

కౌంటింగ్ రోజు హై అలర్ట్.. ఏపీలో కఠిన ఆంక్షలు

స్పెషల్ ఆఫీసర్లంతా వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు డీజీపీ హరీష్.

కౌంటింగ్ రోజు హై అలర్ట్.. ఏపీలో కఠిన ఆంక్షలు
X

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై నిషేధం..

బాణసంచా తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలపై ఆంక్షలు..

కౌంటింగ్ రోజు ర్యాలీలు, విజయోత్సవాలపై పరిమితులు..

పోలింగ్ రోజు ఏపీలో జరిగిన హింసను, అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, కౌంటింగ్ రోజు మరింత అలర్ట్ గా ఉండాలని పోలీసులకు సూచించింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. అల్లర్లు జరిగే అవకాశాలున్న పల్నాడు, చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులు కనపడేలా బందోబస్తు పెంచారు.

ప్రత్యేక అధికారులు..

కౌంటింగ్ రోజున ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీలు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నా కూడా.. ప్రత్యేకంగా కౌంటింగ్ రోజు 56 మంది స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో అల్లర్లు జరగకుండా డ్యూటీలో ఉంటారు. పల్నాడు జిల్లాకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమించారు. సున్నితమైన సెగ్మెంట్లలో మకాం వేసి, అక్కడ లా అండర్ ఆర్డర్ బాధ్యతను వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్లంతా వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలిచ్చారు డీజీపీ హరీష్.

ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర కఠిన ఆంక్షలు అమలు చేస్తామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. మరోవైపు కౌంటింగ్ విషయంలో ఈసీ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరించాలని అధికారులకు సూచించారు సీఈఓ ముకేష్ కుమార్ మీనా. మొత్తమ్మీద పోలింగ్ రోజు జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ కోసం పగడ్బందీగా సిద్ధమవుతున్నారు ఉన్నతాధికారులు.

First Published:  26 May 2024 2:44 AM GMT
Next Story