Telugu Global
Andhra Pradesh

ఓట్లడిగితే జనం తంతారా ?

పనులను పూర్తిచేసే విషయంలో అధికారులు ఇలాగే వ్యవహరిస్తే రేపు ఎన్నికల్లో తాము ఓట్లెలా అడగుతామని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. పనులు చేయకుండా ఓట్లడిగితే జనాలు మమ్మల్ని తంతారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్లడిగితే జనం తంతారా ?
X

పనులుచేయకుండా రాబోయే ఎన్నికల్లో ఓట్లడిగితే జనాలు తంతారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడుతు గ్రామాల్లో పనులు జరగటంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతు తమ గ్రామాల్లో పనులు జరగటంలేదని, నిధుల లేవని చెప్పి కొన్ని పనులను అర్ధాంతరంగా నిలిపేశారని ఫిర్యాదుచేశారు. దాంతో స్పీకర్ కు బాగా కోపమొచ్చేసింది. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఉద్దేశించి తమ్మినేని మాట్లాడుతు పనులు మొదలుపెట్టకుండా ఎంతకాలం జాప్యం చేస్తారంటు మండిపోయారు.

మొదలుపెట్టిన పనులను మధ్యలో ఆపేస్తే జనాలెంత ఇబ్బందులు పడతారో తెలీదా అంటు నిలదీశారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా వీధుల్లో పైపులైన్లు వేసి కుళాయిలు బిగంచి జనాలకు మంచినీటిని అందించాలని ఆదేశించారు. ఒకవైపు ఎన్నికల దగ్గరకు వస్తున్న విషయం తెలిసి అధికారులు ఇంత ఉదాసీనంగా ఉంటే ఎలాగంటు రెచ్చిపోయారు. పనులను పూర్తిచేసే విషయంలో అధికారులు ఇలాగే వ్యవహరిస్తే రేపు ఎన్నికల్లో తాము ఓట్లెలా అడగుతామన్నారు. పనులు చేయకుండా ఓట్లడిగితే జనాలు మమ్మల్ని తంతారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి స్పీకర్ కు ఇంతకాలానికి వాస్తవం కనబడినట్లుంది. చాలా గ్రామాల్లో పనులు ఇలాగే జరుగుతున్న విషయం స్పీకర్ కు తెలీదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పనులు మొదలుపెట్టకపోవటమో లేకపోతే అర్ధారంతరంగా నిలిపేయటమో ఎందుకు జరుగుతోంది ? ఎందుకంటే నిధుల సమస్యని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంచాయితీల్లో నిధులుంటే కదా డెవలప్మెంట్ పనులు చేయటానికి.

ఏదో కారణంతో పంచాయితీల ఖాతాల్లో ఉన్న డబ్బంతా ప్రభుత్వం ఊడ్చేసింది. పనులుచేయాలంటే డబ్బులు లేవు. ఒకవేళ చేసినా బిల్లులు సకాలంలో రావటంలేదు. కారణం ఏమిటంటే మళ్ళీ నిధుల సమస్యే. అందుకనే సర్పంచులు లేదా జడ్పీటీసీలు కూడా పనులు చేయించలేకపోతున్నారు. వచ్చిన నిధులతో అరాకొరా పనులు మొదలుపెట్టి అర్ధాంరతరంగా ఆపేస్తున్నారు. కాబట్టి అధికారుల మీద స్పీకర్ ఆరవటం ఆపేసి ముందు ప్రభుత్వంతో మాట్లాడాలి. నిధులు విడుదలచేయిస్తే పనులు మధ్యలో ఎందుకు ఆగిపోతాయి ? పనులు చేయకుండా ఓట్లడిగితే జనాలు తంతారనే భయం ప్రజాప్రతినిధుల్లో ఉంటే చాలదు పనులు చేయించే సత్తా ఉండాలి. అప్పుడే పనులు జరుగుతాయి.

First Published:  25 Jun 2023 5:49 AM GMT
Next Story