Telugu Global
Andhra Pradesh

అమిత్ షాపై చంద్రబాబు రాళ్లు వేయించలేదా..? బీజేపీ రియాక్షన్ ఇది..

బాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, తిరుపతిలో అమిత్ షాపై రాళ్లేయించింది టీడీపీ నేతలేనని అన్నారు సోము వీర్రాజు. చంద్రబాబు తన హయాంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.

అమిత్ షాపై చంద్రబాబు రాళ్లు వేయించలేదా..? బీజేపీ రియాక్షన్ ఇది..
X

ఇటీవల పవన్ కల్యాణ్‌ని విజయవాడ హోటల్‌లో కలసిన చంద్రబాబు.. ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తామంతా కలసి పోరాడతామని చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్‌తో బీజేపీ ఇరుకునపడింది. టీడీపీతో తమకి పొత్తు లేదంటే లేదని చెప్పుకునే బీజేపీ నేతలు, పవన్‌తో చంద్రబాబు భేటీపై స్పందించడానికి తటపటాయించారు. చంద్రబాబు భేటీని స్వాగతిస్తే ఇరుకునపడినట్టే, వ్యతిరేకిస్తే పవన్‌ని పక్కనపెట్టినట్టే. అందుకే రెండు రోజులు వేచి చూసిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా సోము వీర్రాజు స్పందించారు.

తమ మిత్రపక్షం జనసేన అధినేతను చంద్రబాబు కలిస్తే తప్పేముందని మీడియాని ప్రశ్నించారు సోము వీర్రాజు. ఈ విషయంలో మీడియా మరీ తొందరపడి ఊహాగానాలు వ్యాపింపజేయాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో చంద్రబాబుకి కూడా కౌంటర్ ఇచ్చారు వీర్రాజు. బాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, తిరుపతిలో అమిత్ షాపై రాళ్లేయించింది టీడీపీ నేతలేనని అన్నారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.

అంతా అధిష్టానం చూసుకుంటుంది..

కన్నా లక్ష్మీనారాయణ తనపై చేసిన విమర్శలను తేలిగ్గా తీసిపారేశారు వీర్రాజు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయని, కన్నా కామెంట్లను అలాగే చూస్తున్నానని చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా కామెంట్లపై ఇంతకు మించి తాను మాట్లాడలేనన్నారు. అన్ని పరిణామాలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు వీర్రాజు. ఇక ఏపీ బీజేపీ సహ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ కూడా జనసేన-టీడీపీ వ్యవహారంపై స్పందించారు. ప్రస్తుతం జనసేనతో టీడీపీ పొత్తు కొనసాగుతుందని చెప్పారాయన. వైసీపీ-టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు అంటూ ఎద్దేవా చేశారు. రెండూ దొంగల పార్టీలేనని, టీడీపీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. విశాఖ ఘటన తర్వాత బీజేపీ నేతలంతా పవన్‌తో టచ్‌లోనే ఉన్నారని, బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ లేదని చెప్పుకొచ్చారు సునీల్ దియోధర్.

First Published:  20 Oct 2022 6:30 AM GMT
Next Story