Telugu Global
Andhra Pradesh

వీర్రాజు కక్కలేక మింగలేక.. జగన్ కి ఓ లేఖ

వీర్రాజు లేఖ రాసినంత మాత్రాన జగన్ వణికిపోయి కేంద్ర పథకాలపై తన స్టిక్కర్లు తీసేస్తారని అస్సలు అనుకోలేం, అసలా లేఖను ఆయన పట్టించుకుంటారని, ప్రతిగా వీర్రాజుపై విమర్శలు చేస్తారని కూడా అనుకోలేం.

వీర్రాజు కక్కలేక మింగలేక.. జగన్ కి ఓ లేఖ
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. నిధుల విడుదలలో కానీ, అప్పు తెచ్చుకోడానికి అనుమతులు కానీ, అడిగిందే తడవుగా అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు కేటాయింపులు కానీ.. ఇలా అన్నిట్లోనూ జగన్ కి మోదీ అండదండలున్నాయి. కానీ ఏపీలోని బీజేపీకి మాత్రం వైసీపీని విమర్శించాలనే టాస్క్ ఇచ్చారు. పాపం సోము వీర్రాజు.. జగన్ ని ఎలా విమర్శించాలో, ఎందులో విమర్శించాలో తెలియక లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన మరో లేఖ రాశారు.. అసలు కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లేంటి అంటూ గొప్ప లాజిక్ వెదికారు వీర్రాజు.


తప్పేంటి..?

కేంద్ర పథకాలకు సీఎం జగన్ స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అందులో తప్పేముంది. కేంద్రం కేటాయింపులేమీ నేరుగా మోదీ జేబులోనుంచి రావట్లేదు కదా. రాష్ట్రాల ప్రజలు కట్టిన పన్నుల్లోనుంచే కాస్త విదిలిస్తున్నారు. ఇక్కడ ఇగో ప్రాబ్లమ్స్ సహజం. కానీ కేంద్రానికి జగన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవు, ఆమధ్య అమిత్ షా ఏదో హడావిడి చేశారు కానీ, జగన్ ని ఇబ్బంది పెట్టడం కేంద్రంలోని బీజేపీకి సుతరామూ ఇష్టం లేదు. నిజంగానే ఇబ్బంది పెడితే, రాజ్యసభలో కీలక బిల్లుల విషయంలో వైసీపీ హ్యాండిస్తే బీజేపీకి కష్టం. అందుకే జగన్ అంటే వారికి ఇష్టం. కానీ ఏపీలో బీజేపీకి జగన్ ని విమర్శించాల్సిన అవసరం ఉంది. ఏపీలో బీజేపీ ఉనికి కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయాలి. అందుకే వీర్రాజు అవస్థ పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్పు అని జగన్ కి రాసిన లేఖలో హితవు పలికారు సోము వీర్రాజు. ఆ ప్రచారాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని సూచించారు. కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు. ఈ లేఖలో వీర్రాజు కాస్త ఘాటు పదాలు వాడినా.. అభ్యర్థించుకోవడం మినహా ఆయన చేయగలిగిందేమీ లేదు. వీర్రాజు లేఖ రాసినంత మాత్రాన జగన్ వణికిపోయి కేంద్ర పథకాలపై తన స్టిక్కర్లు తీసేస్తారని అస్సలు అనుకోలేం, అసలా లేఖను ఆయన పట్టించుకుంటారని, ప్రతిగా వీర్రాజుపై విమర్శలు చేస్తారని కూడా అనుకోలేం. ఏపీలో బీజేపీ ఉనికిపాట్లకు ఈ లేఖ ఓ సంకేతం మాత్రమే.

First Published:  29 Jun 2023 1:03 PM GMT
Next Story