Telugu Global
Andhra Pradesh

‘దేశం’ క్లిష్ట పరిస్థితుల్లో ఉందా?

చంద్రబాబు కోసం బీజేపీలో కొందరు, జనసేన, వామపక్షాలు + ఎల్లో మీడియా కలిసిపోయాయి. ఇన్నిశక్తులు కలిశాయంటేనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అర్థ‌మైపోతోంది.

‘దేశం’ క్లిష్ట పరిస్థితుల్లో ఉందా?
X

అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని చెప్పిన డైలాగ్ చాలా పాపులరైంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అదే డైలాగు చెప్పుకుంటున్నారు చాలామంది. కాకపోతే అప్పటి డైలాగుకు ఇప్పటి డైలాగుకు తేడా ఉంది. అప్పటి డైలాగులో దేశమంటే దేశమనే అర్థం. ఇప్పటి డైలాగులో దేశమంటే తెలుగుదేశం పార్టీ అని మాత్రమే అర్థం. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు.

పార్టీ అధినేత జైలుకు వెళ్ళటంతో పార్టీలో నాయకత్వ సమస్య పెరిగిపోతోంది. జనాల్లో సానుభూతి కూడా అనుకున్నంతగా కనబడకపోవటం పార్టీ నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. అందుకనే చంద్రబాబుకు మద్దతుగా ఎక్కడెక్కడి పార్టీల నేతలు ఎల్లో మీడియాతో చేతులు కలుపుతున్నారు. అంతా కలిసి ఎలాగైనా చంద్రబాబును జైలులో నుండి బయటకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో బీజేపీ నేత సుజనా చౌద‌రి చెప్పిన డైలాగులే ఇందుకు నిదర్శనం.

జగన్ తప్పులు చేసి ఇంకోళ్ళ మీద రుద్దుతున్నారని సుజనా చెప్పటమే విడ్డూరంగా ఉంది. చంద్రబాబు హయాంలోనే స్కిల్ స్కామ్ జరిగింది. జరిగిన స్కామ్‌ను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వంలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ + ఐటీ శాఖలు. దీనిపై దర్యాప్తు చేసి కొందరిని అరెస్టులు చేసింది, ఆస్తులను జప్తు చేసింది ఈడీ, సీబీఐలు. రిమాండు విధించింది, ఆస్తుల జప్తుకు అనుమతించింది కోర్టులు. అప్పట్లోనే కేంద్ర దర్యాప్తు సంస్థ‌లు సమాచారం ఇచ్చినా, హెచ్చరించినా చంద్రబాబు ఎలాంటి విచారణ జరగకుండా తొక్కిపెట్టారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ మొదలైంది. ఇందులో జగన్ చేసిన తప్పేముంది? చంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో పెట్టడమే జగన్ తప్పన్నట్లుగా ఉంది సుజనా కామెంట్. అలాగే చంద్రబాబు అరెస్టులో బీజేపీ హస్తం లేదని చెప్పటానికి సుజనా నానా అవస్థ‌లు పడ్డారు. తమ్ముళ్ళలోనే కాదు బీజేపీ నేతల్లో కూడా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. కాకపోతే ఆ అనుమానాలను బయటకు చెబితే ఏమి జరుగుతుందో అనే భయంతో చెప్పటంలేదు.

జనసేన అధినేత పవన్, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేష్ అందరూ బీజేపీ హస్తం లేదనే పైకి చెబుతున్నారు. ఎల్లో మీడియాకు కూడా బీజేపీ పెద్దలపైనే అనుమానాలున్నాయి. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగా రాయలేకపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కోసం బీజేపీలో కొందరు, జనసేన, వామపక్షాలు + ఎల్లో మీడియా కలిసిపోయాయి. ఇన్నిశక్తులు కలిశాయంటేనే ‘దేశం’ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అర్థ‌మైపోతోంది.


First Published:  7 Oct 2023 5:47 AM GMT
Next Story